- కూట‌మి ఎఫెక్ట్ దెబ్బ‌తో న‌ర‌సాపురం పార్ల‌మెంటులో వైసీపీ విల‌విలా
- ఉండి మిన‌హా అన్ని చోట్లా కూట‌మి అభ్య‌ర్థుల‌కే గెలుపు ఛాన్స్‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ లోనే జనసేన బిజేపీ,టీడీపీ, వైసీపీ కూటమి చాలా బలంగా ఉన్న పార్లమెంట్ల‌లో నియోజకవర్గం నర్సాపురం ఒకటి. పైగా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సొంత ప్రాంతం. గత ఎన్నికలలో పవన్‌తో పాటు పవన్ అన్న నాగబాబు సైతం ఇక్కడే పోటీ చేశారు. నాగబాబు నరసాపురం పార్లమెంటుకు పవన్ కళ్యాణ్ భీమవరం అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మూడు పార్టీల కూటమి ప్రభావంతో కూటమి చాలా అంటే చాలా బలంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ వైసీపీ నుంచి భీమవరం పట్టణానికి చెందిన అడ్వకేట్ గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ గతంలో భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పని చేసిన వారే.


ఈ పార్లమెంటు సీటు నుంచి గతంలో గెలిచిన అనుభవం బీజేపీకి ఉంది. ఇద్దరు అభ్య‌ర్థులు తొలిసారి ఏకంగా పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. వర్మ క్షత్రియ సమాజ వర్గానికి చెందినవారు కాగా.. ఉమాబాల బీసీలలో బలమైన శెట్టిబలిజ వర్గానికి చెందినవారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పాలకొల్లులో టీడీపీ సీటింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. తణుకులో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆచంటలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నరసాపురం నుంచి జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఏకపక్ష విజయాలు సాధిస్తారని అంచనాలు ఉన్నాయి.


భీమవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు టీడీపీ నుంచి జనసేనలో చేరి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పుల‌పర్తి అంజిబాబుకు మధ్య గట్టి పోటీ ఉంది. అయినా ఎంతో కొంత జనసేనకే ఎడ్జ్ ఉందని అంటున్నారు. తాడేపల్లిగూడెంలో కచ్చితంగా జనసేన నుంచి పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తారు అనుకునే దశ నుంచి.. అక్కడ మంత్రి కొట్టు సత్యనారాయణ గట్టి పోటీ ఇస్తున్నారు. ఉండిలో మాత్రం ముక్కోణపు పోటీ నెలకొంది. టీడీపీ నుంచి రఘురాం కృష్ణంరాజు పోటీ చేస్తుంటే.. టీడీపీ సీటు రాని మాజీ ఎమ్మెల్యే క‌లువ‌పూడి శివ ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు.


శివ కచ్చితంగా ఇక్కడ రెండో ప్లేస్ లో ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. ఆయనకు 25వేల ఓట్లు కచ్చితంగా వస్తాయని అంటున్నారు. ముక్కోణ‌పు పోటీలో వైసీపీ లాభపడుతుందా లేదా మూడో స్థానానికి పడిపోతుందా అన్నది ప్రస్తుతానికి అయితే అంచనాలకి అందటం లేదు. ఏది ఏమైనా ఓవరాల్ గా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చూస్తే జగన్ చేసిన బీసీ మహిళ ప్రయోగం పెద్దగా ఫలించే పరిస్థితి లేదని అంటున్నారు. బిజేపీకి ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా సర్వేలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: