ఇంకో 60 గంటల తర్వాత  ఏపీలో ఎన్నికలు మొదలవుతాయి.. ఇప్పటికే 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలలో వైసిపి, టిడిపి కూటమి అభ్యర్థులంతా ప్రచారంలో మునిగిపోయారు.  ఎవరికి నచ్చిన విధంగా వారు హామీలు ఇస్తూ  ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరిస్తూ ప్రజల మనసులు గెలుచుకున్నారు. కానీ ప్రజలు ఎవరిని ఓన్ చేసుకున్నారు అనేది ఇప్పటికీ ఒక క్లారిటీకి రావడం లేదు. ఓవైపు వైసీపీ పార్టీ మేము గెలుస్తామంటే, మరోవైపు టీడీపీ కూటమి మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారు  ప్రచారం చేస్తూ ప్రలోభాలు మొదలుపెట్టారు. దీంతో ఈ చివరి రెండు మూడు రోజులు చాలా కీలకం కానున్నాయి.

 ప్రస్తుతం సైలెంట్ గా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తల నుంచి పెద్ద పెద్ద నాయకుల వరకు ప్రచారం చేస్తున్నారు.  వాడ వాడ తిరుగుతూ వారికి నచ్చిన గిఫ్టులు, డబ్బులు అందిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో రెండు పార్టీలకు ఆ జిల్లా కీలకంగా మారింది.  అక్కడ మెజారిటీ సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందనేది ఏపీ లో సెంటిమెంట్. ఇంతకీ ఆ జిల్లా ఏంటయ్యా అంటే  కర్నూలు. ఈ జిల్లా టిడిపికి  గత ఎన్నికల్లో కొరక రాని కొయ్యగా మారింది. ఈ జిల్లాపై ఈసారి పట్టు సాధించాలని టిడిపి అధినేత చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఆ జిల్లాలోనే ఎక్కువసార్లు పర్యటిస్తూ ఉన్నారు. అయితే ఈ జిల్లాలో  మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి.  2014 ఎన్నికల్లో టిడిపి కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. 2019కి వచ్చేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ జిల్లాను కైవసం చేసుకుంది. అంతేకాదు అధికారంలోకి కూడా వచ్చింది.

దీంతో ఈసారి టిడిపి కూటమి జిల్లాలో వీలైనంతవరకు ఎక్కువ సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టాలని తహతహ లాడుతోంది. అందుకే గత మూడు, నాలుగు వారాల నుంచి  చంద్రబాబు నాయుడు 5 సార్లు, యువగళం పేరుతో నారా లోకేష్ నాలుగుసార్లు,  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మూడు రోజుల పాటు పర్యటన చేశారు. టిడిపి నాయకులంతా ఈ జిల్లాపై నజర్ వేసి గట్టి పట్టు సాధించాలని చూస్తున్నారు. ఇక్కడ పట్టు సాధిస్తే తప్పక రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని వారి నమ్మకం. ఇదే తరుణంలో వైసిపి కూడా  గతంలో వచ్చిన రిజల్ట్ నే రిపీట్ చేస్తానని భావిస్తోంది. ఆ జిల్లాలో సిట్టింగ్లకే మళ్ళీ టికెట్ ఇచ్చింది. వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో  కొత్తవారికి అవకాశం ఇచ్చింది.ఈ విధంగా కర్నూలు జిల్లాలో వైసిపి, టిడిపి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇక్కడ ఎవరు మెజారిటీ సాధిస్తారు అనేది ఎన్నికల రిజల్ట్ తర్వాతే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: