పద్మవ్యూహం అనేది మహాభారతం చదివిన వారికి బాగా అర్ధం అవుతుంది. యుద్ధంలో సామాన్యులెవరూ ఛేదించలేని, అర్థం చేసుకోలేని వ్యూహం అది. అలాంటి పద్మవ్యూహంలోకి వెళ్లి తిరిగి రాగల వారు కేవలం ఇద్దరే ఉన్నారు. కృష్ణుడు, అర్జునుడు మాత్రమే ఈ పద్మవ్యూహాన్ని అర్ధం చేసుకుని, దానిని చేధించి తిరిగి రాగలరు. అయితే అభిమన్యుడు మాత్రం పద్మవ్యూహంలోకి వెళ్లి వీర మరణం పొందాడు. దీనిని ప్రస్తుతం అంతా రాజకీయాలకు అన్వయిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం పద్మవ్యూహంలో చిక్కుకున్నారని చెబుతున్నారు.

 ఆయన అర్జునుడు అవుతారా లేక అభిమన్యుడు అవుతారా అనేది తీవ్ర చర్చగా మారింది. సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకున్న జగన్ సింగిల్‌గా బరిలోకి దిగాడు. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారంతా తమకు ఓటు వేసి మరోసారి గెలిపిస్తారని నమ్మకంగా ఉన్నారు. మరో వైపు అధికారమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను కేసులతో ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని నాశనం చేయడం, ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దౌర్జన్యాలు, హత్యాకాండలు వంటివి ప్రచారాస్త్రాలుగా మలిచింది. అయితే ఎవరు ప్రజల మద్దతు పొందారు, ఎవరు ఎక్కువగా ఓటర్లను తమ వైపు మరల్చుకున్నారనే విషయం త్వరలో తేలనుంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

ఏపీలో ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ పక్కా ప్రణాళికలతో సిద్ధమయ్యాయి. వైసీపీని అధికారం నుంచి దింపేందుకు వ్యూహాలు పన్నాయి. ముఖ్యంగా కేవలం సంక్షేమ పథకాలపైనే జగన్ ఆధారపడ్డారు. ఓ పక్క అధికార యంత్రాంగం, మరో వైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకో పక్క ఉద్యోగాల కల్పన పేరుతో యువతను తమ వైపు తిప్పుకోవడం వంటి వ్యూహాలను టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలో స్థిరపడ్డ ఓటర్లను భారీగా రప్పించడంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సక్సెస్ అయింది.


ఒక్కసారిగా హైదరాబాద్ నగరం బోసిపోయిందంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లిన వారి వివరాలను టీడీపీ సేకరించింది. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. చివరికి ఆయా ప్రాంతాల్లో స్థిరపడ్డ ఓటర్లతోనూ నేరుగా మాట్లాడింది. ఆయా ప్రాంతంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. వారిని నేరుగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు బస్సులు ఏర్పాటు చేసింది. కుదరని పక్షంలో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇలా ఉపాధి లేకే అందరూ ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని యువత బలంగా నమ్మేలా చేసింది. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి, తమ వైపునకు తిప్పుకుంది. ఇలాంటి ఎన్నో వ్యూహాలు అమలు చేసింది. అయితే అవి టీడీపీకి ప్లస్ అయ్యేలా ఉంటాయా లేక మైనస్ అవుతాయా అనేది జూన్ 4న తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: