- ఈ సారి లోకేష్ గెల‌వ‌క‌పోతే సీనియ‌ర్ల ముందు ప‌లుచ‌నే
- పార్టీ ప‌గ్గాల‌ప్ప‌గించాలంటే ఈ గెలుపు త‌ప్ప‌నిస‌రి
- 2029 ఎన్నిక‌ల‌కు లోకేష్ చేతిలోనే పార్టీ

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేశారు. ఇది ఆయ న‌కు రెండో ద‌ఫా పోలింగ్‌. ఓడిన చోటే గెల‌వాల‌నేది ఆయ‌న పంతం. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు మ‌రో నియోజ‌కవ‌ర్గం నుంచి కూడా పోటీ చేయాల‌ని అనుకున్నా.. ఈ సారి మాత్రం అలా కుద‌ర‌ద‌ని నారా లోకేషే తేల్చిచెప్ప‌డం గ‌మ‌నార్హం. దీంతో నారా లోకేష్‌కు ఈ ఎన్నిక‌లు పెద్ద ప‌రీక్ష‌గా మారాయి.


పైగా.. నారా లోకేష్ ఇప్పుడు గెలిచి తీరాలి. లేక‌పోతే.. రెండు ర‌కాలుగా ఇబ్బందులు టీడీపీని వెంటాడే అవ‌కాశం ఉంది. ఆయ‌న గెలుస్తారా?  లేదా? అన్న‌ది జూన్  4వ తేదీన తెలియ‌నున్నా.. ఆయ‌న గెలుపుపై టీడీపీ భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో నారా లోకేష్ ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. మండ‌లిలో ఆయ‌న‌కు స‌భ్య‌త్వం ఉండ‌డంతో అక్క‌డ త‌న వాయిస్‌ను రెయిజ్ చేశారు. మూడు రాజ‌ధానుల బిల్లుకు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు.


ఎన్నిక‌ల‌కు కొద్దిమాసాల ముందు.. ఈ మండ‌లి స‌భ్య‌త్వానికి కూడా స‌మ‌యం చెల్లింది. దీంతో ఆయ‌న‌కు ఇప్పుడు రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన అధికారం అంటూ ఏమీ లేదు. ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించాలంటే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి తీరాలి. ఇది ఒక కార‌ణం. రెండోది.. పార్టీ ప‌గ్గాలు వ‌చ్చే ఐదేళ్ల‌లో ఏ క్ష‌ణ‌మైనా అప్ప‌గించే అవ‌కాశం ఉంది. చంద్ర‌బాబు వ‌య‌సు రీత్యా కావొచ్చు.. పార్టీకి ఉన్న యాస్పిరేష‌న్స్ కావొచ్చు.
నారా లోకేష్‌కు వ‌చ్చే ఐదేళ్ల‌లో ఖ‌చ్చితంగా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌నే విధానంపై అయితే.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది.


ఈ నేప‌థ్యంలోనూ ఆయ‌న గెలిచి తీరాలి. లేక‌పోతే.. సీనియ‌ర్ల ముందు మ‌రింత ప‌లుచ‌న అవుతారు.  లేదా.. వైసీపీ నేత‌లు మ‌రింత గేలి చేసే అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో నారా లోకేష్ కు ఈ ఎన్నిక‌లు ఒక ర‌కంగా అగ్నిప‌రీక్ష‌నే త‌ల‌పిస్తున్నాయి. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాలన్నా.. త‌న గ‌ళం బ‌లంగా వినిపించాల‌న్నా.. పార్టీపై ప‌ట్టు పెంచుకోవాల‌న్నా.. సీనియ‌ర్లు త‌న మాట వినాల‌న్నా కూడా.. నారా లోకేష్ కు ఈ ఎన్నిక అత్యంత కీల‌కంగా మారింద‌ని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: