1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయం నుంచి కుప్పంలో టీడీపీ అభ్యర్థి తప్ప మరేవ్వరూ గెలవడం లేదు. ఈ నియోజకవర్గం టీడీపీకి ఒక పెద్ద కంచుకోటగా మారిపోయింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిని ఓడించడం ఎవరితరం కాలేదంటే అతిశయోక్తి కాదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు 30,722 ఓట్ల మెజారిటీతో ఇక్కడి నుంచి విజయ బావుటా ఎగరవేశారు. 2014లో 47,121, 2009లో 46,055, 2004లో 59,588, 1999లో 56,588, 1989లో 6,918 ఓట్ల తేడాతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బాబు చిత్తు చేశారు.

2024 ఎన్నికలలో చంద్రబాబును ఓడించి టీడీపీ విజయాల పరంపరకు బ్రేక్ వేయాలని జగన్ చాలానే ప్రయత్నించారు. జగన్ తనకు బాగా నమ్మకస్తుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బరిలోకి దింపి కుప్పం ప్రజలను వైసీపీ వైపు తిప్పేలా వ్యూహాలు అమలు చేశారు. వైసీపీ అభ్యర్థి భరత్‌ను గెలిపిస్తే పాలేరు ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేశారు. అంతేకాదు ఎన్నికలకు ముందు కుప్పం ప్రజలకు హంద్రీ-నీవా జలాలు అందుబాటులోకి వచ్చేలా వైసీపీ కష్టపడింది.

బీసీ వర్గానికి చెందిన భరత్‌ని గెలిపిస్తే ఆయనకు కేబినెట్‌ బెర్త్‌ కూడా ఇస్తానని, తద్వారా కుప్పం బాగా అభివృద్ధి చెందుతుందని జగన్‌ ప్రకటించారు. అయితే ఏడుసార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఈసారి కూడా గెలవడానికి చాలానే ప్రయత్నాలు చేశారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులను ఈ ప్రాంతంలో తిప్పుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. నారా భువనేశ్వరి కూడా కుప్పంలో తిరుగుతూ తన శాయశక్తులా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో కుప్పం నుంచి గెలవాలని చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు.

వైసీపీ ఎన్ని వ్యూహాలు అమలు చేసినా కుప్పం ప్రజలు తన వెన్నంటే ఉంటారని నిరూపించడానికి ఆయన ఈ లక్ష్యం పెట్టుకున్నారు. మరి ఆయన లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారా? చంద్రబాబు ఈ ఫిగర్ మెజారిటీ సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నారు. ఈ నియోజకవర్గంలో ఆరు నెలలలోనే మూడుసార్లు ఆయన తిరిగారు. నియోజకవర్గానికి మంచి చేస్తానని చాలా హామీలను ఇచ్చారు. ఇకపోతే ఈసారి కుప్పం నియోజకవర్గంలో 90 శాతం పోలింగ్ నమోదయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,25,775 మంది ఓటర్లు ఉండగా, వారిలో 89.88 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే దాదాపు 2,02,920 మంది ఓటు వేశారు. ఇందులో వైసిపి అభ్యర్థి కంటే లక్ష ఓట్లు ఎక్కువ తెచ్చుకోవడం అంటే చాలా కష్టమని చెప్పుకోవచ్చు. నిజానికి ఈసారి బాబు మెజారిటీ బాగా తగ్గుతుందని అంటున్నారు. మరి ఎవరి అంచనా కరెక్ట్ అవుతుందో తెలియాలంటే జూన్ 4న వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: