ఆంధ్రా బీజేపీ కూటమిలో గతంలో వున్న జోష్ ఇపుడు కనిపించడం లేదనేది కొంతమంది సో కాల్డ్ విశ్లేషకుల మాట. ముఖ్యంగా గత అయిదారేళ్ళుగా ఓ రేంజులో హవా చూపించిన ముగ్గురు సీనియర్ నేతలు ఇపుడు సైలెంట్ అయిపోయారని టాక్ వినబడుతోంది. వీరిలో మొదటి వారు బీజేపీని ఏపీ ప్రెసిడెంట్ గా చేసిన సోము వీర్రాజు ఒకరు. ఆయన బీజేపీలోకి వచ్చి దాదాపు 4 దశాబ్దాలు పైనే అయింది. పైపెచ్చు ఆయనికి ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ కూడా దండిగా ఉంది. ఇక పార్టీ పట్ల విధేయత ఎలాగూ ఉండనే ఉంది. అందువల్లనే కేంద్ర పెద్దలతో అయన నేరుగా మెలుగుతూ వుంటారు. అయితే అన్ని ఉన్నా తాజా ఎన్నికల్లో మాత్రం ఆయన టికెట్ మాత్రం తెచ్చుకోకపోయారు పాపం! నిజానికి ఆయన రాజమండ్రి నుంచి ఎంపీ సీటుకు పోటీ చేయాలనుకున్నారు. అక్కడ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేయడంతో ఆయనకు చెక్ పడింది.

ఆ తరువాత ఆయన రాజమండ్రి వైపు చూసినా భంగపాటు తప్పలేదు. తరువాత పొమ్మనలేక పొగబెట్టారు అన్నట్టు అనపర్తి సీటు ఆయనకోసం ఖాళీ పెట్టి ఉంచగా అక్కడ పోటీ చేసినా పరువు పోతుందని ఆయనకి బాగా తెలుసు.... దాంతో నో చెప్పేశారు. అందువల్లనే ఆయన ఏపీ బీజేపీ అధినాయకత్వం మీద చాలా కోపంగా ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. తరువాత రెండో నేత విష్ణు వర్ధన్ రెడ్డి. ఆయన బీజేపీలో ఎపుడూ యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. కానీ ఈసారి ఆయనకు కూడా భంగపాటు తప్పలేదు. కదిరి అసెంబ్లీ అయినా లేక హిందూపురం ఎంపీ అయినా పోటీకి ఆయన ఆసక్తి చూపారు కానీ టికెట్ దక్కలేదు. దాంతో ఆయన మౌన ముద్రలోకి వెళ్లిపోయారు.

అలాగే రాజ్యసభ సభ్యుడిగా నిన్నటిదాకా చెలామణీ అయినటువంటి తాజా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆయన కూడా బీజేపీ అంటే మక్కువ ఎక్కువ చూపేవారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం ఏపీలో బీజేపీలో చేరిన టీడీపీ నేతలకు పలుకుబడి ఎక్కువగా ఉండడం వీరికి గండికొట్టినంత పని అయింది. దాంతో విశాఖ నుంచి ఎంపీ సీటు ఆశించిన ఈయనకు సీటు దక్కలేదు. రేపటి ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిస్తే రానున్న అయిదేళ్ళూ వీరికి అజ్ఞాత వాసమే అని అంటున్నారు విశ్లేషకులు. అలా కాకుండా పొరపాటున వైసీపీ గెలిస్తే వీరు మళ్లీ నోరు తెరచి ఏపీ బీజేపీ అధినాయకత్వం వైఖరి మీద విమర్శలు చేసే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: