- ఫ్యాన్ పార్టీని గింగ‌రాలు కొట్టించిన బ‌త్తుల‌..?
- గోదారి తీరాన వైసీపీ జ‌క్కంపూడి రాజాకు గ‌ట్టిపోటీ
- ఏపీ జ‌న‌సేన‌లోనే తిరుగులేని మాస్ లీడ‌ర్లలో ఒక‌డిగా గుర్తింపు

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

వైసీపీలో ఎంపీటీసీగా ప్రస్థానం ప్రారంభించిన ఆ నేత ఈరోజు జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు గోదావరి తీరాన అదే వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. ఆ నేత ఎవరో ? కాదు.. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నుంచి జనసేన తరఫున బరిలో ఉన్న బత్తుల బలరామకృష్ణ. గతంలో వైసిపి నుంచి ఎంపీటీసీగా గెలిచిన బలరామకృష్ణ ప్రస్తుతం రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత జక్కంపూడి రాజా కనుసన్న‌ల్లోనే రాజకీయం చేసేవారు. ఆ తర్వాత వారిద్దరికీ ఎక్కడో గ్యాప్ వచ్చింది. వెంటనే జనసేన కండువా కప్పుకున్న బలరామకృష్ణ నియోజకవర్గంలో ఒక్కసారిగా దూసుకుపోయారు.


ఊర మాస్ లీడ‌ర్ కావడంతో అనుకున్న దానికంటే జనాల్లోకి చాలా స్పీడ్ గా వెళ్లారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేనప్పుడు కూడా జనసేన బలంగా కనిపించిన నియోజకవర్గాలలో రాజానగరం కూడా ఉంది అంటే అక్కడ బత్తుల బలరామకృష్ణ పడిన కష్టం అని చెప్పాలి. ఇక ముందు నుంచి ఊహించినట్టుగానే రాజానగరం సీటు జనసేనకు కేటాయించడం.. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ బత్తుల బలరామకృష్ణ పేరు ఖరారు చేయటం జరిగిపోయాయి. మామూలుగా అయితే జక్కంపూడి రాజా ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఆయనను ఢీకొట్టడం.. కనీస పోటీ ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదని అనుకున్నారు.


పైగా టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఎప్పుడో కాడి కింద పడేశారు. బొడ్డు వెంక‌ట‌ర‌మ‌ణ చౌద‌రి వ‌చ్చే వ‌ర‌కు టీడీపీ అక్క‌డ సోదిలో కూడా లేదు. ఆ టైంలో జనసేన కనీసం పోటీ అయిన ఇస్తుందా అన్న సందేహాలు పటాపంచలు చేస్తూ బలరామకృష్ణ చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమితులైన బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా పూర్తిగా సపోర్ట్ చేయడం బలరామకృష్ణ కు బాగా కలిసి వచ్చింది.


ఏదేమైనా కాపుసామాజిక వ‌ర్గ ప్రాబ‌ల్యం ఎక్కువుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. ఇటు ఇదే గోదారి జిల్లా నుంచి ప‌వ‌న్ కూడా పోటీలో ఉండ‌డం.. అటు టీడీపీ ఇన్‌చార్జ్ స‌పోర్ట్‌.. టీడీపీ కేడ‌ర్ స‌పోర్ట్‌తో బ‌ల‌రామ‌కృష్ణ ఇక్క‌డ అంచ‌నాల‌కు మించి గ‌ట్టిపోటీ ఇచ్చారు. మ‌రి రేప‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ జ‌క్కంపూడిని ఓడించి జెయింట్ కిల్ల‌ర్ అవుతారా ?  లేదా అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: