అదొక అందమైన వింత గ్రామం. ఆ ఊరిలో సుమారు 30 కుటుంబాలు నివాసముంటున్నాయి. గ్రామంలో కేవలం వంద మంది జనాభా మాత్రమే ఉంటారు. పైగా వీరి జీవనోపాధి వ్యవసాయం... ఇక్కడ తాజాగా పండించిన పంటలనే వారు ఆహారంగా తీసుకుంటారు.ప్రకృతిని ప్రేమిస్తూ కాలుష్యానికి చాలా దూరంగా ఉంటారు. 90 ఏళ్లకు పైబడి ఉన్న వారు కూడా వ్యవసాయం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో చావుకు సవాల్ విసురుతున్నారు కామారెడ్డి జిల్లా రాజమ్మ తండా వాసులు.ఈనాటి ఆధునిక కాలంలో కూడా సాంప్రదాయ పద్ధతులతో పంటలు పండిస్తూ... జీవనం సాగిస్తున్న కామారెడ్డి జిల్లాలోని రాజమ్మ తండా గ్రామం ఇతరులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. 30 ఏళ్లలో... కేవలం ఏడంటే... ఏడుగురు మాత్రమే మరణించారంటే.. ఆ గ్రామస్తుల ఆరోగ్యం ఎంత సంపూర్ణంగా ఉందో అర్ధమవుతుంది. ప్రస్తుత కాలంలో కాలుష్య వాతావరణంతో.. కల్తీ ఆహారం తీసుకుంటూ.. నిత్యం రోగాలతో మనుషులు సహవాసం చేస్తున్నారు. కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన రాజమ్మ తాండ గ్రామం మాత్రం ప్రకృతి జీవనాన్ని గుర్తు చేస్తోంది. కాలుష్యానికి, వ్యాధులకు దూరంగా పచ్చని ఒడిలో ఈ గ్రామం జీవిస్తోంది.


కరోనా రెండు దశల్లో కూడా ఒక్కరికి కూడా సోకలేదంటే ఆ తండా వాసుల జీవన శైలి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తాండ వాసులు ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడమే కాదు ఆస్పత్రులకూ కూడా చాలా దూరంగా ఉంటున్నారు. మంచి వాతావరణంలో జీవించడంతో వారికి ఎలాంటి రోగాలు దరిచేరడం లేదు... 90 ఏళ్ల పైబడి ఉన్నవారూ వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్నారు. వారు కట్టెల పొయ్యిపైనే వంట చేసుకుంటారు. అక్కడి ప్రధాన ఆహారం మొక్కజొన్న రొట్టె.. వెల్లుల్లి కారం... ఏ ఇంట్లో చూసినా కూడా రొట్టె లేకుండా ఒక్క పూట కూడా గడవదని తాండ వాసులు చెబుతున్నారు.మినరల్‌ వాటర్‌ తాగడమే మంచి అని మనం అనుకుంటుంటే.. భూగర్భం నుంచి వచ్చే శుద్ధ జలాలనే అమృతంలా భావిస్తున్నారు ఈ తాండ  గ్రామస్థులు. తాము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి తమ ఆహార పద్ధతులే కారణమంటున్నారు తాండ ప్రజలు. ప్రస్తుతం ఈ గ్రామం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: