ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మరో వైపు వైసీపీ విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు చెప్పాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే అధికారం దక్కుతుందని ఇంకొన్ని సర్వేలు తేల్చాయి. అయితే ప్రజానాడిని పసిగట్టడం ప్రస్తుతం చాలా కష్టంగా ఉందని సెఫాలజిస్టులు సైతం అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఎవరు విజయం సాధిస్తారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొందరి చెబుతున్నారు. 

అయితే విజయంపై మాత్రం ఇరు పక్షాలు చాలా ధీమాగా ఉన్నాయి. జూన్ 4న వెలువడే ఫలితాలతో సంబరాలు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో అనకాపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మలసాల భరత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనంగా మారాయి. 2024లో వైసీపీ విజయం ఖాయమైందని, వీటి ఫలితాల గురించి ఎవరూ ఆందోళన చెంద వద్దని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. అంతా 2029 ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలో చూడాలని వైసీపీ శ్రేణులకు ఆయన ఓ సందేశాన్ని ఇచ్చారు. ఆయనలో కనిపించేది ఆత్మవిశ్వాసమా, అతి నమ్మకమా అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

అనకాపల్లి నియోజకవర్గంలోని వైసీపీ మండల స్థాయి నాయకులతో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ ఇటీవల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో '2024లో గెలిచాం అని భావించండి. ఇక ఈ విషయం వదిలేయండి. 2029లో ఎంత మెజారిటీ సాధించాలో అని నేను ఆలోచిస్తున్నాను. మీరు కూడా అదే ఆలోచించండి' అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో మలసాల భరత్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


సమావేశంలో 2029లోనూ తానే వైసీపీ అభ్యర్థిగా ఉంటానని భరత్ చెప్పకనే చెప్పారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాక ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తానని, ప్రజలకు ధన్యవాదాలు చెబుతానని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో సహకారం అందించినట్లే వచ్చే ఎన్నికల్లోనూ తనతో కలిసి నడవాలని పార్టీ శ్రేణులకు సందేశమిచ్చారు. 2024లోనే రాజకీయ ఉద్ధండులకు జగన్ అవకాశం ఇవ్వలేదు. కొత్త అభ్యర్థులను ఆయన బరిలోకి దించారు. అలాంటిది భరత్ ఏకంగా 2029 గురించి చాలా ధీమాగా ఉండడం కొంత విమర్శలకు తావిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే చాలా మంది నేతలు పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఇలాంటి నేతల వ్యాఖ్యలతో ప్రతిపక్ష పార్టీకి చెందిన సానుభూతిపరులు, నాయకులు, సామాన్యులు ట్రోలింగ్ చేసే అవకాశమిచ్చారని క్షేత్ర స్థాయిలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: