ఇకపై అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, వీధుల్లో నిర్వహించే తినుబండారాలు షాపులను తెరుచుకోవచ్చని వ్యాపారం చేయోచ్చని పేర్కొన్నారు. మద్యం షాపుల్ని మాత్రం ఎప్పటిలాగే రాత్రి 11 గంటలకు మూసి వేస్తారని చెప్పారు. మద్యం తాగడానికి తాను వ్యక్తిగతంగా వ్యతిరేకినని.. అర్ధరాత్రి వరకు తెరిచే ఉంచితే.. అప్పటి వరకు తాగుతూనే ఉంటారని అందుకే మద్యం దుకాణాల్ని ఇప్పటికే అమలు చేస్తున్న పదకొండు గంటల టైంను ఫాలో అవుతామని చెప్పారు.
మారిన హైదరాబాద్ మహానగర స్వరూపానికి తగ్గట్లు కాకుండా పోలీసులు శాంతి భద్రతల పేరుతో రాతి 11 గంటలకే ఫుడ్ కోర్టులు, హోటళ్లను మూసి వేస్తున్నారు. దీంతో రాత్రిళ్లు మహా నగర వాసులు ఆహారం దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఐటీ హబ్ గా మారిన హైదరాబాద్ లో రాత్రి షిఫ్టుల్లో పని చేస్తున్న వారు తిండి దొరక్క విలవిలలాడుతున్నారు. నిజానికి ఇటీవల కాలంలో మూడు పోలీసు కమిషనరేట్లలో పోలీసులు అమలు చేస్తున్న విధానంతో ఈ పరిస్థితి తలెత్తింది.
గడిచిన పదేళ్లుగా మహా నగరం నిద్ర పోవడం లేదు. పగలూ, రాత్రిళ్లూ అనే తేడా లేకుండా వివిధ కంపెనీలు పని చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ కంపెనీలు రౌండ్ ద క్లాక్ పని చేస్తాయి. ఇలాంటప్పుడు రాత్రిళ్లు పని చేసే వారికి ఫుడ్ సౌకర్యం లేకపోతే ఎలా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకే కాదు.. వీధుల్లోని ఫుడ్ ట్రక్ కోర్టులకు అనుమతి ఇస్తున్నట్లు తీపి కబురు చెప్పారు.