ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రుల తో వరుస భేటీలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలను కేంద్ర నేతల దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి నిర్మాణం , నీటి ప్రాజెక్టులు , గ్రామీణ ఉపాధి పథకాలు , క్రీడా మౌలిక సదుపాయాల పై చర్చలు సాగాయి. చంద్రబాబు ప్రధానంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అదనంగా రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరిన ఆయన, 16వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన రెవెన్యూ లోటు నివేదికను అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి రెండో విడత నిధుల కోసం కేంద్రం నుంచి గ్రాంట్‌ను కోరారు .
 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు కేంద్ర మద్దతు అవసరమని వివరించారు . మరోవైపు, కేంద్ర ఆరోగ్య మరియు క్రీడా మంత్రి మాండవీయతో భేటీలో చంద్రబాబు కీలక ప్రతిపాదనలు ఉంచారు. అమరావతిలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం, జల క్రీడల హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి, రాజమహేంద్రవరం, నరసరావుపేట వంటి నగరాల్లో ‘ఖేలో ఇండియా’ కింద మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. గుంటూరులో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం రూ.170 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.



ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో రాష్ట్ర నీటి సమస్యలు, పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై చర్చించారు. గోదావరి మిగులు జలాల వినియోగ హక్కు ఏపీకి ఉందని స్పష్టం చేశారు. జలవివాదాలపై తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య సమావేశం నిర్వహించబడింది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ మరమ్మతులు, భద్రత చర్యలపై ఏకాభిప్రాయానికి చేరుకున్నారు. జలవివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్‌ను కేంద్రానికి అందజేసిన చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మద్దతును మరింత పెంచాలంటూ వినతులు అందజేశారు. జలవనరుల నుంచి క్రీడల వరకు అన్ని రంగాల్లో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: