ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి అంతా బాగానే ఉందని, తమకు ఎదురు ఎవరూ లేరని భావిస్తోంది. అధికారం కుర్చీలో కూర్చున్నవారికి అంతా ఓకే, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేవారే చుట్టూ ఉండటంతో, లోపలున్న లోటుపాట్లపై పెద్దగా దృష్టి పడటం లేదు. కానీ ప్రజల మూడ్ మాత్రం మారిపోతోంది. గత రెండు దశాబ్దాలుగా ఓటర్లలో ఐదు సంవత్సరాలకో మార్పు కావాలనే భావన బలంగా పెరిగింది. దాంతో అధికారంలో ఎవరున్నా చివరికి వ్యతిరేకత ఎదుర్కోక తప్పడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మాత్రం కూటమి పాలనపై బాంబు పేల్చేశారు. పైపైకి చూస్తే గ్రాఫ్ బాగానే ఉన్నట్లు కనిపించినా, గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం వ్యతిరేకత ఎక్కువైందని ఆయన చెప్పడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పదిహేనునెలల పాలనలోనే ప్రజలలో విపరీతమైన అసంతృప్తి పెరిగిందని ఆయన తన సర్వే ఫలితాలను బయటపెట్టారు. కూటమి పాలనలో ఏ వర్గం సంతోషంగా లేర‌ని, రైతు నుంచి విద్యార్థి వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఇక చింతా మోహన్ మరో ఆసక్తికరమైన అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. కూటమిలో లోపల కుమ్ములాటలు మొదలై చాలా కాలమే అయ్యిందని, ఇప్పుడు అవి బహిరంగంగా బయటపడుతున్నాయని అన్నారు. అసెంబ్లీలోనూ ప్రజల సమస్యలు చెప్పుకోవాల్సిన చోటా, పరస్పర ఆరోపణలతో గడిపేస్తున్నారని, ఇది పాలన వైఫల్యానికి నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. కూటమి నేతలు ఐక్యత ఉందని చెప్పుకుంటున్నా, వాస్తవానికి లోపల విభేదాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.ఏపీలో కూటమి గెలుపుపై చింతా మోహన్ పెద్ద డౌట్ వ్యక్తం చేశారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయని సంచలనంగా ఆరోపించారు. అంతేకాదు, "పదిహేనేళ్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు తన నియోజకవర్గానికి ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయాడు. కనీసం ఒక ఇడ్లీ కొట్టు అయినా పెట్టించగలిగారా?" అంటూ ఘాటు ప్రశ్న వేశారు.

దళితుల పట్ల ప్రేమ చూపుతున్నానని చెప్పే బాబు, నిజంగా వారిని గౌరవిస్తే సీఎం కుర్చీని కనీసం రెండేళ్లపాటు దళిత వర్గానికి ఇవ్వాలని చింతా మోహన్ డిమాండ్ పెట్టారు. ఆయన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. మొత్తం మీద చింతా మోహన్ రిపోర్ట్ కూటమి పట్ల ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసింది. పైకి సైలెంట్‌గా కనిపిస్తున్న కూటమి లోపల అంతా బాగోలేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఈ ఆరోపణలకు కూటమి ఎలా స్పందిస్తుంది, నిజంగానే ప్రజలలో వ్యతిరేకత పెరిగిందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: