వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు భారీ కసరత్తు చేస్తున్నారు. దాదాపు పదిహేనునెలలుగా ఆయన పార్టీ నేతలతో కూర్చుని సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ, అవసరమైతే పరామర్శలు, ఓదార్పు యాత్రలు చేస్తూ పార్టీని చక్కదిద్దే పనిలో ఉన్నారు. కానీ, జగన్ మళ్లీ జనంలోకి వచ్చే టైమ్ దగ్గరపడిందన్న వార్తలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయదశమి తర్వాతే స్టార్ట్ ..  ప్రస్తుతం భాద్రపద మాసం నడుస్తోంది. దీన్నే శూన్య మాసం అంటారు. సెప్టెంబర్ చివర్లో ఆశ్వయుజ మాసం మొదలవుతుంది. అదే సమయంలో విజయదశమి పండుగ కూడా వస్తుంది. పండుగ సందడి ముగిసిన వెంటనే జగన్ జిల్లా టూర్లకు బయలుదేరతారు అన్నది తాజా సమాచారం. ఇది పార్టీ వర్గాల్లోనే కాక, రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చగా మారింది.


శ్రీకాకుళం నుంచే బాణం .. జగన్ తన పర్యటనలను ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి స్టార్ట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లానే మొదటి టార్గెట్‌గా పెట్టారట. ప్రతి నెల కనీసం రెండు జిల్లాలు వంతున జగన్ పర్యటనలు చేస్తూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ స్థితిగతులు సమీక్షించనున్నారని చెబుతున్నారు. స్థానిక నాయకులు, పార్టీ ఇన్‌చార్జీలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి, గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేరుగా తెలుసుకుంటారట. రెండేళ్ల టూర్ ప్లాన్ .. జగన్ జిల్లా పర్యటనలు ఒకట్రెండు నెలల కబుర్లే కాదు, రెండేళ్ల పాటు సాగుతాయి అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంటే 2027 వరకూ జగన్ జిల్లాలకే ఫుల్ టైమ్ కేటాయించబోతున్నారు. ఆ తర్వాతే మహా పాదయాత్రకు శ్రీకారం చుడతారట. ఈ పాదయాత్ర 2029 ఎన్నికల వరకు కొనసాగుతుందని ప్రచారం. కొత్త స్టైల్ పాదయాత్ర .. గతంలో జగన్ 37 వేల కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు.

 

అయితే ఈసారి ఆయన మరింత లోతైన పల్లెల్లోకి వెళ్లేలా కొత్త స్టైల్‌లో పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈసారి అయిదు వేల కిలోమీటర్ల దాకా పాదయాత్ర ఉండొచ్చని సమాచారం. కానీ టార్గెట్ మాత్రం స్పష్టంగా ఉంది - ప్రతి ఓటరుతో మమేకం కావడమే! 2029 మిషన్ ప్రారంభం .. ప్రస్తుతం అధికార కూటమి మొదటి ఏడిన్నర కాలం హనీమూన్ పీరియడ్‌లా వదిలేసిన జగన్, ఇక మిగతా కాలాన్ని మాత్రం పవర్ ఫుల్ యాక్షన్ ప్లాన్తో సెట్ చేసుకున్నారు. ఇక మీదట ఆయన ఉండేది జనంలోనే అని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. 2029 ఎన్నికలకు జనసాన్నిధ్యం, పాదయాత్రే ప్రధాన అస్త్రం అవుతుందని స్పష్టమైంది. మొత్తం మీద విజయదశమి తర్వాత జగన్ జనం మధ్యలో అడుగుపెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఆ ప్రకటన కోసం వైసీపీ వర్గాలు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: