
ఇలా చూస్తే వైఎస్ కుటుంబంలో నాలుగో తరం వారసుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో రాజారెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్.. ఇప్పుడు రాజారెడ్డి మళ్లీ రంగప్రవేశం చేస్తే కుటుంబ వారసత్వం కొనసాగినట్టే అవుతుంది. ముత్తాత పేరు ‘రాజారెడ్డి’ అని ఉండటం కూడా ఆయన రాజకీయ పయనానికి సానుకూల వాతావరణం సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో జగన్‌కు ఎలాంటి ప్రత్యర్థి లేడనే పరిస్థితి ఉన్నా, షర్మిల వ్యూహాత్మకంగా తన కుమారుడిని అదే నియోజకవర్గంలో పోటీకి దింపితే పెద్ద మార్పు రాబోయే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోనే షర్మిల కడపలో అవినాష్ రెడ్డిపై బలమైన పోరాటం చేసింది. ఇప్పుడు ఆమె తన అన్న జగన్‌ను టార్గెట్ చేయడానికి కుమారుడి ఎంట్రీని వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని చర్చ సాగుతోంది.
వచ్చే ఎన్నికలకు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం ఉంది. ఈ గ్యాప్‌లో షర్మిల తన కుమారుడిని పబ్లిక్‌లో పరిచయం చేస్తూ, వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి ప్రజలతో దగ్గర చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని సమీకరించుకోవడమే ఆమె ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తం మీద, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరన్నట్లు, రాబోయే ఎన్నికల్లో జగన్‌కు సొంత మేనల్లుడే ప్రత్యర్థిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే పులివెందుల రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం.