
20 మంది చిన్నారుల మృతి… దేశాన్ని కుదిపేసిన విషాదం:
కోల్డ్ రిఫ్ దగ్గుమందు కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఇరవై మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు పిల్లలకు సాధారణ దగ్గు మందుగా ఇచ్చిన ఈ సిరప్ ప్రాణాంతకమైందని వైద్యులు, అధికారులు నిర్ధారించారు. విషపూరిత పదార్థాల వాడకం కారణంగా ఈ ఘటనలు జరిగాయని ఫోరెన్సిక్ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సంఘటనల తరువాత మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్ర విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో తయారీ లోపాలు బయటపడటంతో కంపెనీ యజమాని రంగనాధన్ పై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయడం కేసులో కీలక మలుపుగా మారింది.
రాష్ట్రాలన్నింటికీ అలర్ట్ :
ఈ ఘటన తరువాత తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఈ మందును తక్షణమే నిషేధించాయి. వైద్యులు ఈ దగ్గుమందును ప్రిస్క్రైబ్ చేయవద్దని ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. అంతేకాదు — ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న మందును వెనక్కి తెచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆరోగ్య శాఖ అధికారులు ఈ కంపెనీ ఉత్పత్తులన్నింటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సీరప్ సాంపిల్స్ సేకరించి ల్యాబ్ టెస్టులు చేస్తున్నారు.
రంగనాధన్ అరెస్ట్ – కేసులో కీలక అడుగు :
కోల్డ్ రిఫ్ మందు తయారీలో ఘోర నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మందులో నిషేధిత రసాయనాల వాడకంతోనే ఈ మరణాలు సంభవించాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ యజమాని రంగనాధన్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో మరిన్ని పేర్లు బయటపడే అవకాశముందని సమాచారం. సరఫరా చైన్, డిస్ట్రిబ్యూటర్లపైనా విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుని, కఠిన చర్యలు తీసుకునే సూచనలు ఇస్తోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సాధారణ దగ్గు మందు ప్రాణాలు తీస్తే - నియంత్రణ వ్యవస్థ ఎక్కడుందన్న ప్రశ్న లేచింది. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఈ ఘటనపై పూర్తి రిపోర్టు కోరింది.