జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రాజకీయ ఉత్కంఠ మరింతగా పెరిగింది. పార్టీ అధికారికంగా అభ్యర్థిగా న‌వీన్ యాద‌వ్ పేరును ప్రకటించిన క్షణం నుంచి అంతర్గత రాజకీయాలు గట్టిగా ముసురుకున్నాయి. ఇన్నాళ్లుగా ఎవరు టికెట్ పొందుతారో అనే ఆసక్తి, ఇప్పుడు ‘ముందే ఫిక్స్ అయ్యిందా?’ అనే అనుమానాలుగా మారింది. బుధవారం రాత్రి అభ్యర్థి ప్రకటన తర్వాత సీనియర్ నేతలు, టికెట్ ఆశావహులు, స్థానిక కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అంజనీకుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి, న‌వీన్ యాద‌వ్‌లకు జూబ్లీహిల్స్ టికెట్‌పై రేసు జరిగింది. పార్టీ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోందని చెప్పినా… అసలైన అభ్యర్థి ఇప్పటికే ఖరారు అయ్యారని ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ ప్రకటనకు ముందు నుంచే న‌వీన్ యాద‌వ్ చేసిన పలు చర్యలే ఈ అనుమానాలకు బలమంటున్నారు సీనియర్ నేతలు.


సందేహాల వెనుక నాలుగు బలమైన కారణాలు:
1. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక దశలోనే ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో న‌వీన్ యాద‌వ్ జూబ్లీహిల్స్‌లో యాక్టివ్‌గా ముమ్మరంగా పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ చేశారు. 2. మూడు రోజుల క్రితమే ఆయన ఓటర్లకు ఐడీ కార్డులు పంచారు. దీనిపై ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. 3. ఫిర్యాదులు వచ్చినా… వెనక్కి తగ్గకపోగా, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల ముందు శక్తివంతమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 4. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడన్న ముద్ర న‌వీన్ మీద ఉండటంతో “ఇది అంతా ముందే డిసైడ్ అయ్యిందే” అనే భావన సీనియర్ నేతల్లో పటిష్టమైంది.



ఈ అంశాలన్నీ పార్టీ లోపలే పెద్ద చర్చకు దారితీశాయి. అభ్యర్థి ఎంపిక న్యాయంగా జరగలేదని, ఇతర నేతలను కేవలం ‘డ్రామా’ కోసం ఉపయోగించారని సీనియర్ నేతలు మండిపడుతున్నారు. అధిష్టానం నాలుగు పేర్లు తీసుకొని నివేదికలు సమీక్షించినట్టుగా చూపించినా, వాస్తవానికి టికెట్ అప్పటికే న‌వీన్‌కు ఇచ్చేశారని వారి ఆరోపణ. ఇక ఈ నిర్ణయంపై పార్టీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ స్పందన ఏంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతర్గత విభేదాలు బయటకు రావడం వల్ల ప్రచారంలో పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో న‌వీన్ యాద‌వ్ టికెట్ కాంగ్రెస్ లో మరో “రచ్చ” కి నాంది పలికింది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: