జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని మరింత మసాలా చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, పాలన విజయాలను చెప్పడమే కాకుండా, ఓటర్ల మనసును కదిలించే భావోద్వేగ రాజకీయాలు కూడా ఆయన ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. పీజేఆర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన నేతల్లో పీజేఆర్‌ ఒకరు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు ఎంతో సాయం చేసిన ఆయన పేరు ఇప్పటికీ గౌరవంగా వినిపిస్తుంది. రేవంత్ ఈ భావనను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
 

“కృష్ణానగర్‌లో పీజేఆర్‌ విగ్రహం పెడతాం” అంటూ రేవంత్ ప్రకటించడం ద్వారా, పాత కాంగ్రెస్ ఓటు బ్యాంకును రీ-యాక్టివేట్ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్‌ పేరు తెరపైకి తెచ్చి కమ్మ సామాజిక వర్గం, సెటిలర్ ఓట్లను ఆకర్షించాలనే మాస్ట‌ర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు రేవంత్. అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని ఆయన సవాల్ విసరడం చర్చనీయాంశమైంది. “ఎవరు అడ్డుకుంటారో చూద్దాం” అన్న రేవంత్ ధైర్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇది కేవలం విగ్రహాల గురించే కాదు - ఓటర్ల మనసును తాకే సింబాలిక్ స్ట్రాటజీ. ఇక మరో వైపు రేవంత్ ప్రచారం మొత్తం “అధికార పార్టీకి ఓటేస్తే ఇబ్బందులు వస్తాయి” అనే పరోక్ష సందేశాలతో నిండిపోయింది.

 

అభివృద్ధి నిలుస్తుందని, నిధులు ఆగిపోతాయని చెబుతూ భయపెట్టే పంథా కూడా ఆయన అవలంబిస్తున్నారు. ఈ విధంగా రేవంత్ - భావోద్వేగం, భయం, అభివృద్ధి - అనే మూడు కార్డులు ఒకేసారి ఆడుతున్నారు. జూబ్లీహిల్స్‌ను తేలిగ్గా తీసుకోవద్దని కాంగ్రెస్ వర్గాలకు స్పష్టం చేశారు రేవంత్. ప్రతి ఓటు కోసం స్వయంగా ఫీల్డ్‌లోకి దిగి శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు. తానే అభ్యర్థి అన్నంత ఉత్సాహంతో ఆయన పోరాటం సాగుతోంది. పీజేఆర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాల అంశం ఎన్నికల తర్వాత అమలు అవుతుందా అన్నది ఇంకా తెలియదు. కానీ, ఈ “విగ్రహ రాజకీయాలు” రేవంత్‌కు ఫీల్డ్‌లో గట్టి పుష్ ఇచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం జూబ్లీహిల్స్‌లో ఒక్క మాటే వినిపిస్తోంది -“రేవంత్ గేమ్ ప్లాన్ జోరుగా ఉంది.. విగ్రహాల ఎఫెక్ట్ ఫుల్ స్వింగ్‌లో ఉంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: