కోమటిరెడ్డిపై జరుగుతున్న ప్రచారం తనను తీవ్రంగా కలిచివేసిందని చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డిని సాక్షాత్తూ శ్రీరాముడితో పోల్చిన అనిరుధ్ రెడ్డి, ఆయనను ఒక దేవుడిలా అభివర్ణించారు. కోమటిరెడ్డి వంటి నిష్కల్మషమైన వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రికి ఉన్న గొంతు సమస్యను అడ్డు పెట్టుకుని కొందరు కావాలనే కుట్రపూరితంగా ఆయన ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిణామాల వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, గత మూడు రోజులుగా అన్నం కూడా ముట్టలేదని అనిరుధ్ రెడ్డి పేర్కొనడం విశేషం.
కోమటిరెడ్డి పట్ల తనకు ఉన్న అచంచలమైన భక్తిని చాటుకుంటూ, ఆయన కోసం బావిలో దూకమన్నా దూకడానికి తాను సిద్ధమని ప్రకటించి సంచలనం రేపారు. రాజకీయాల్లో పారదర్శకతకు కోమటిరెడ్డి నిలువుటద్దమని చెబుతూ ఆయన ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. మంత్రి వాడే మొబైల్ ఫోన్‌కు కనీసం లాక్ కూడా ఉండదని, అంతటి నిగర్వి అని కొనియాడారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ మొత్తం వివాదం మొదలై మూడు రోజులు గడుస్తున్నా, అందరూ మర్చిపోతున్న సమయంలో ఎమ్మెల్యే స్పందించడం రాజకీయ వర్గాల్లో విమర్శలకు తావిస్తోంది. అనిరుధ్ రెడ్డి నిజంగా మద్దతు తెలుపుతున్నారా లేక పరోక్షంగా ఎగతాళి చేస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేసిన 'అన్నం తినలేదు', 'బావిలో దూకుతా' వంటి వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోలర్లకు పని పెట్టాయి. కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులు కూడా ఈ అతి భక్తిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి