తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మంత్రులు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన రిపోర్టులను పరిశీలించారు. తొలిరోజు 11 గంటలు, మలిరోజు ఏకంగా 12 గంటల పాటు ఈ సదస్సులో ఆయన కూర్చుని అన్నీ శ్రద్ధగా వినడం.. ఆయనలోని రాష్ట్ర అభివృద్ధి పట్ల ఉన్న ప్రేమను, అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షలను పట్టి చూపుతున్నాయి. ఈ విషయాలనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.
విసుగు, అలుపు అనేది లేకుండా.. నాయకులు ఎలా పనిచేయాలో చంద్రబాబు నుంచి నేర్చుకోవచ్చనేది మంత్రి కొండపల్లి నిశ్చితాభిప్రాయం. సహజంగా నేటి తరం నాయకులకు సమయం ఉండడం లేదన్న వాదన ఉంది. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇన్నేసి గంటలపాటు సమయం కేటాయించి.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చాలా ఓపికగా తెలుసుకుని.. కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇది సహజంగానే 76 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు వంటి నాయకులకు కష్టమైన పనేనని అనుకుంటారు. కానీ, చంద్రబాబు దీనిని సునాయాసంగా చేసి చూపించారు.
ఈ పరిణామాలు.. నేటి తరానికి దిక్సూచి వంటివని మంత్రి కొండపల్లి అభిప్రాయపడ్డారు. `అనుభవజ్ఞులై న అధికారులు, మంత్రులు, ఎందరో వారి నిబద్దత చూసి ఆశ్చర్యపోవడం మా వంతు అయింది.` అని చెప్పడం ద్వారా.. ప్రజాసేవకు ముందుకు వచ్చే నేటితరానికి చంద్రబాబు ఒక దిక్సూచి వంటివారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో కాస్త కఠినంగా హెచ్చరించడం, ఆయా పనులను ఎలా చేయాలో చెప్పడం కూడా.. చంద్రబాబు ద్వారా నేర్చుకునేందుకు అవకాశం కలిగిందని రాసుకొచ్చారు. ఇవన్నీ.. నేటి తరానికి కరదీపికలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన పోస్టు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి