ఏపీ ఎన్నికలపై మెల్లగా క్లారిటీ వస్తోంది. ఎవరు ఎవరితో కలుస్తారు, ఎవరు ఏ విధంగా ముందుకు పోతారు. ఎవరి ఎత్తులు ఏంటి, పొత్తులేంటి అన్న దానిపైన ఓ విధమైన స్పష్టత కనిపిస్తోంది. ఏపీ రాజకీయ తెరపై ప్రధాన శక్తులు ఏమి ఉంటాయన్న దానిపైన కూడా అందరికీ అవగాహన ఏర్పడుతోంది. ఎన్నికలు కొద్ది నెలలు ఉండగానే ఈ విధమైన రూపం ఏపీ రాజకీయ ముఖ చిత్రం సంతరించుకోవడం ఓటర్లకే మేలు చేస్తుంది.


తప్పదు త్రిముఖం :


వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు తప్పేట్లు లేదు. మొత్తం 175 సీట్లకు పోటీ చేసేందుకు అధికార తెలుగుదేశం పార్టీతో పాటు, విపక్ష వైసీపీ సిధ్ధంగా ఉండగా, జనసేన సైతం సై అంటోంది. ఆ విషయాన్ని కుండ బద్దలు కొట్టి మరీ పవన్ చెప్పేశాక ఇంక ఏపీలో సీన్ ఏంటన్నది అర్ధమైపోతోంది. కుదిరితే వామపక్షాలతో వెళ్తాం, లేకపోతే మేమే అన్ని సీట్లు పోటీకి దిగుతామంటూ జనసేనాని క్లారిటీ ఇచ్చాక ఇంక ఎవరికీ ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. టీడీపీతో జనసేన దోస్తీ చేస్తుందన్న ఊహాగానాలకు చంద్రబాబే చొరవ తీసుకుని చెక్ పడేలా చూసారు. బాబు కనుక పవన్ని పొత్తులకు పిలవకపోతే ఈ డౌట్స్ ఎన్నికల వరకూ అలా సాగుతూనే ఉండేవి.


వైసీపీ సింగిలే :


ఇక మరో ప్రధాన పార్టీ వైసీపీ తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తమని చాలాకాలంగా చెబుతూ వస్తోంది. దానికి తగినట్లుగా ఆ పార్టీ ఏర్పాట్లను చేసుకుంటోంది. మధ్యలో పవన్ తో కలుస్తారని గందరగోళం చెలరేగినా ఎప్పటికపుడు వైసీపీ నేతలు క్లారిటీ ఇస్తూనే పోయారు. మరో వైపు జగన్, పవన్ల వ్యవహార శైలి చూసిన వారికి ఈ ఇద్దరు అసలు కలవరు అని సులువుగా చెప్పేయగలరు. మొత్తానికి చూసుకుంటే వైసీపీని సింగిల్ గానే వచ్చి గెలిపించుకోవాలన్న ఆరాటం అయితే జగన్ లో కనిపిస్తోంది. దానికి ఆయన‌కున్న లెక్కలు ఆయనకు ఉన్నాయి.


కాంగ్రెస్ ఏంటి :


ఇక ఏపీలో మిగిలిన ఓ పార్టీ కాంగ్రెస్. నిజానికి కాంగ్రెస్ ని పెద్దగా లెక్కలోకి తీసుకోకూడదు కానీ, జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితులు, తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేసిన వైనం చూసిన తరువాత ఏపీలోనూ ఈ రెండూ జట్టు కడతాయేమోనని అంతా భావించడం సబబు, దానికి తగినట్లుగా రెండు వైపుల నుంచి సంకేతాలు కూడా వస్తున్నాయి. అన్నీ కుదిరితే కాంగ్రెస్ కి ఓ పాతిక సీట్లు ఇచ్చి  టీడీపీ మిగిలిన సీట్లకు పోటీ పడుతుంది. 


ఇక బీజేపీ ఒకటి మిగిలింది, ఆ పార్టీ ఈసారి ఒంటరి పోరుకు రెడీ అయిపోవాల్సిందే. తెలంగాణాలో ఎలాగైతే పోటీ చేశారో ఏపీలోనూ అలాగే సింగిల్ గానే తలపడాలి.  అయినా ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండే చాన్సే లేదు.  ఏ విధంగా చూసుకున్నా ఏపీలో  త్రిముఖ పోరు తప్ప బహుముఖీయమైన పోటీలు ఉండే సమస్యే లేదు. ఇదీ ఇప్పటికి ఏపీ రాజకీయ ముఖచిత్రం. అన్నీ అనుకున్నట్లుగా జరిగింతే ఇదే సీన్ ఎన్నికలలో  కూడా కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: