తూర్పు గోదావరి జిల్లాలో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న కొత్తపేటలో ఈసారి అదిరిపోయే ఫైట్ జరగనుంది. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధిపై కేవలం 700 ఓట్ల తేడాతో గెలుపొందిన చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ నుంచి మరోసారి పోటీ చేయబోతున్నారు. అలాగే జగ్గిరెడ్డి చేతిలో ఓడిపోయిన బండారు సత్యానందరావు తెదేపా నుంచి మరోసారి అదృష్టం పరీక్షించుకొనున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి బండారు సోదరుడు శ్రీనివాసరావు.. జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. అన్నను ఓడించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. ఇక సిట్టింగ్‌గా ఉన్న జగ్గిరెడ్డి 2004లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. 2014లో జిల్లాలో టీడీపీ ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. 


అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటం వలన పెద్దగా పనులు చేయలేదు. కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ కాపు రిజర్వేషన్లపై జగన్ వైఖరి కొంతవరకు మైనస్ కానుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి తెదేపా నేత బండారుపై ఉంది. పైగా బండారు 1994, 99లలో తెదేపా తరుపున, 2009లో ప్రజారాజ్యం నుంచి గెలుపొందారు. దీంతో ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మరో సీనియర్ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారం బండారుకి కలిసిరానున్నాయి. కానీ బండారు సోదరుడు శ్రీనివాసరావు జనసేన నుంచి పోటీ చేయడం మైనస్. ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉండటం, పవన్ ఇమేజ్ జనసేనకి ప్లస్ అవుతాయి.  


అయితే ప్రధాన పోరు తెదేపా-వైకాపాల మధ్య ఉన్న..జనసేన చీల్చే ఓట్ల ప్రభావం ఏదొక పార్టీకి నష్టం కలిగించడం ఖాయం. ఈ నియోజకవర్గంలో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కాపులు, బీసీలు, ఎస్సీలు ఓట్లు ఎక్కువ. కాపులు ఎక్కువ తెదేపా-జనసేనలకి వైపు ఉండే అవకాశం ఉంది. బీసీల ఓట్లు తెదేపా-వైకాపాలకీ ఎక్కువ పడతాయి. ఎస్సీలు ఎక్కువ వైకాపా వైపు మొగ్గు ఉంటుంది. ఏది ఏమైనా తెదేపా-వైకాపాల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. మరి ఈ సారి ఎన్నికల్లో మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుందో లేక సైకిల్ సవారీ చేస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: