
భారత జట్టు విశ్వ విజేతగా నిలిచిన తర్వాత ఇక భారత క్రికెట్ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే ఇటీవలే ఇక 2011 వరల్డ్ కప్ గెలిచి 12 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ధోని చివర్లో తాను సిక్సర్ కొట్టి అటు జట్టును గెలిపించిన విషయంపై మాట్లాడాడు. తాను సిక్సర్ కొట్టడానికంటే ముందే తాను పొందిన అనుభూతి అనిర్వచనీయం అంటూ చెప్పుకొచ్చాడు ధోని. మరోసారి అలాంటి సందర్భాన్ని సృష్టించడం చాలా కష్టం అంటూ తెలిపాడు. 2011 వరల్డ్ కప్ గెలిచి 12 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాడు ధోని.
నేను కొట్టిన విన్నింగ్ సిక్స్ కి 15 నుంచి 20 నిమిషాల ముందే అత్యుత్తమమైన అనుభూతిని ఆస్వాదించాను. కావలసిన పరుగులు ఎక్కువగా లేవు. భాగస్వామ్యం కూడా బలపడింది. మరోవైపు నుంచి చాలా మంచు కురుస్తుంది. ఇక దాదాపు మా విజయం ఖరారు అయిపోయింది. స్టేడియం అంతా కూడా వందేమాతరం గీతం ఆలపిస్తుంది. ఇక నా భావోద్వేగం పతాక స్థాయికి చేరుకున్న సందర్భం అది. ఇక ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. మరోసారి అలాంటి సందర్భం ఎదురైతే తప్ప ఆ వాతావరణాన్ని సృష్టించలేము అన్నది నా అభిప్రాయం. బహుశా రాబోయే ప్రపంచ కప్ లో అలాంటి దృశ్యం చూడొచ్చేమో అంటూ ధోని చెప్పుకొచ్చాడు..