దొంగఓట్ల గురించి ప్రపంచంలో ఎవరైనా మాట్లాడచ్చు ఒక్క చంద్రబాబునాయుడు తప్ప. ఎందుకంటే చంద్రబాబు చెప్పేమాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతనుండదు కాబట్టి. అధికారంలో ఉన్నపుడు ఎంతటి నీచమైన పనులు చేయటానికి కానీ రాజ్యాంగ వ్యవస్ధలను తుంగలో తొక్కటానికి ఏమాత్రం మొహమాటపడని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఎక్కడలేని నీతులు చెబుతుంటారు. తాజాగా దొంగఓట్లపై చంద్రబాబు చేస్తున్న గోల చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది. ఈమద్యనే జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో అధికార వైసీపీ వేలాది దొంగఓట్లు వేయించుకున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదుచేశారు.




అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ఓ విషయం గుర్తుకొస్తోంది. దొంగఓటు వేయటం దేశద్రోహం చేసినట్లే అనే పెద్ద పెద్ద మాటలు చెబుతున్న చంద్రబాబు మరి ’ఓటుకునోటు’ ఎవరి నిర్వాకమో కూడా చెబితే బాగుంటుంది. తెలంగాణా ఎంఎల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంఎల్ఏ ఓటు కొనుగోలుకు రు. 5 కోట్లకు బేరం కుదుర్చుకుని, రు. 50 లక్షల అడ్వాన్సు పంపించిన పెద్దమనిషి చంద్రబాబే అని యావత్ ప్రపంచానికంతా తెలుసు. అడ్వాన్సు డబ్బు ఇస్తు అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఘటన అప్పట్లో దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎంఎల్సీ ఎన్నికల్లో ఒక ఓటుకు రు. 5 కోట్లు ఇవ్వటంతో పోల్చితే మొన్నటి ఉపఎన్నికలో దొంగఓటు వేయించేందుకు ప్రయత్నించటం ఏపాటిది ?




గట్టిగా మాట్లాడితే దొంగఓట్లు వేయించుకోవటం అన్నది అన్నీపార్టీల్లోను ఉన్నదే. అభ్యర్ధి గట్టివాడైతే, అధికారపార్టీకి చెందిన నేతైతే మిగితావాళ్ళకన్నా ఎక్కువ దొంగఓట్లేయించుకుంటారు. నిజానికి దొంగఓటు వేయించుకోవటం తప్పే అనటంలో సందేహంలేదు. కానీ ఈపని అన్నీ పార్టీలు చేస్తున్నదే. ఎవరి శక్తికి తగ్గట్లుగా వాళ్ళు దొంగ ఓట్లేయించుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. దొరికిన వాడు దొంగ..దొరకని వాడు దొర అంతే తేడా. ఉపఎన్నికలో దొంగఓట్లేసుకున్నారని ఆరోపిస్తున్న టీడీపీ, బీజేపీ నేతలు ఎంతమందిని పోలీసులకు పట్టించారు. ఎక్కడో కల్యాణమండపంలో ఉన్నవారిని, బస్సుల్లో వెళుతున్న వారిని పట్టుకుని దొంగ ఓట్లేయటానికి వచ్చారని గోలచేస్తే ఉపయోగం ఏమిటి ? దొంగఓట్లు వేయించేందుకు టీడీపీ కూడా మదనపల్లి నుండి మనుషులను తెప్పించినట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ విషయమై చంద్రబాబు ఎందుకు నోరుమెదపటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: