టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు గతంలో రాలేదా.. మంత్రి మల్లారెడ్డి ఓ భూవ్యవహారంలో ఫోన్‌లో నేరుగా బెదిరించిన విషయం ఆడియోల ద్వారా లీక్ కాలేదా.. ఆ ఆడియో అన్ని ప్రధాన ఛానళ్లలో ప్రసారం కాలేదా.. దీనిపై మళ్లీ అదే మంత్రి మల్లారెడ్డి.. అబ్బే.. ఆడియో నాది కాదు.. ఎవరో నాపై కుట్ర చేశారు అని వివరణ ఇచ్చుకోలేదా.. ఇంత జరిగినా సరే.. అలాంటిదేమీ జరగలేదు.. మీకు గుర్తున్నా సరే దాన్ని మీరు మర్చిపోండి.. ఎందుకంటే.. అబ్బే మా ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒక్క భూకబ్జా ఆరోపణ కూడా రాలేదని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డిప్రెస్ మీట్‌లోనే తేల్చిపారేశారు.

మంత్రి మల్లా రెడ్డి సంగతి సరే..  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు రాలేదా.. ఆ విషయం కూడా అప్పట్లో రచ్చ రచ్చ అయ్యిందిగా.. అంటారా.. అది కూడా మర్చిపోండి.. అంతే.. ఎందుకంటే అలాంటిది కూడా ఏమీ జరగలేదు.. ఒక వేళ అలాంటి ఆరోపణలు వచ్చినట్టు మీకు గుర్తున్నా మర్చిపోండి..  ఎందుకంటే.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒక్క భూకబ్జా ఆరోపణ కూడా రాలేదని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రెస్ మీట్‌లోనే తేల్చి చెప్పేశారు కదా.

అదేంటి సార్.. చాలా మంది మీద ఆరోపణలు వచ్చాయి కదా.. సాక్షాత్తూ మంత్రి కేటీఆర్‌ ఓ ఫార్మ్‌ హౌజ్‌ అక్రమంగా కట్టుకున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి రచ్చ రచ్చ చేశారు కదా.. అయినా సరే అది కూడా మర్చిపోండి.. ఎందుకంటే.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒక్క భూకబ్జా ఆరోపణ కూడా రాలేదని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పేశారు కదా. అవును.. ఈ నేతలంతా అక్రమాలు చేశారని అనడం లేదు.. కానీ.. కనీసం ఆరోపణలు కూడా రాలేదట.

అదేంటి సార్.. చాలా మందిపై ఆరోపణలు వచ్చాయి కదా అని విలేకరులు అడిగితే.. అబ్బే అలాంటిదేమీ లేదు.. ఎవరిపైనా భూకబ్జా ఆరోపణలు రాలేదు. ఒక్క ఈటలపైనే వచ్చాయి. దానిపై విచారణకు ఆదేశించాం అన్నారు మంత్రిగారు.. ఉంటే.. ఏదీ చూపించండి. ఒక్కటైనా ఉందా.. అని విలేకరులనే ఎదురు దబాయించారు మంత్రిగారు.. పాపం. అక్కడున్న విలేకరులు అంతా తెలిసి కూడా దబాయిస్తే చేసేదేముంది అనుకున్నారో ఏమో.. ఆయన్ను పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే వదిలేశారు.  







మరింత సమాచారం తెలుసుకోండి: