శుక్ర‌వారం అంటే ముస్లింల‌కు ఒక పండ‌గ రోజ‌నే చెప్పాలి. వీలైనంత‌వ‌ర‌కు ప్ర‌తి ముస్లిం ఆరోజు త‌ప్ప‌కుండా న‌మాజ్ చ‌ద‌వ‌డానికి వెళ‌తారు.ప్రపంచంలోని ప్రతి మస్జిద్‌ జుమా (శుక్రవారం) వచ్చిందంటే చాలు, నమాజ్‌లతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ ఇస్లాం ధర్మ నియమావళి ప్రకారం, ప్రపంచంలో ఉన్న ముస్లింలు అయిదు పూటల నమాజ్‌ను విధిగా, తప్పనిసరిగా పాటించాలని అల్లాహ్‌ ఆదేశించాడు. అలాగే వారానికి ఒకసారి దైవాజ్ఞలను వినడానికి నమాజ్‌ను కూడా చేయాలని ముస్లిమ్‌లను ఆదేశించాడు.
 
‘అంతిమ దివ్య ఖురాన్‌’లో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు: ‘‘విశ్వసించిన ప్రజలారా! శుక్రవారం నాడు నమాజ్‌ కోసం పిలిచినప్పుడు దైవ సంస్మరణ వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను విడిచిపెట్టండి. మీరు గ్రహించగలిగితే ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది.’’ (62:9)
 
ఇక, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ ఈ విధంగా ప్రవచించారు: ‘ఎవరైనా జుమా రోజు గుసుల్‌ (తలస్నానం) చేసి జుమా నమాజ్‌ కోసం మస్జిద్‌కు వెళ్ళి అక్కడ నమాజు చేసి, ఇమామ్‌ ఉపన్యాసం ‘ఖుత్బా’ శ్రద్ధగా విని, ఇమామ్‌గారితో పాటు ‘ఫర్జ్‌’ నమాజ్‌ చేస్తే, గత శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు అతని వలన జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి.’ అలాగే, అంతిమ దైవ ప్రవక్త ‘జుమా’ నమాజ్‌ నుంచి మినహాయింపు పొందిన వారి గురించి ఇలా తెలిపారు: ‘‘జుమా నమాజ్‌ను సామూహికంగా చేయడం ముస్లింలకు విధి. అయితే బానిసలకూ, స్త్రీలకూ, చిన్నపిల్లలకూ, వ్యాధిగ్రస్థులకూ, ప్రయాణికులకూ మినహాయింపు ఉంది.’’ సూర్యుడు ఉదయించే రోజులన్నింటికెల్లా జుమా రోజు అత్యంత శ్రేష్ఠమైనది.
 
హజ్రత్‌ ఆదం (అలై)ను అల్లాహ్‌ తన చేతులతో తయారు చేసింది ఈరోజే. అలాగే ఆయన స్వర్గం నుండి భూమి మీదకు ఈ రోజే వచ్చారు. ప్రళయం కూడా ఇదే రోజు వస్తుందని ప్రవక్త తెలిపారు. ‘‘తగిన కారణం లేకుండా సోమరితనంతో వరుసగా మూడు జుమా నమాజులు ఎగ్గొట్టిన వారి హృదయాలకు సన్మార్గ భాగ్యం లభించకుండా అల్లాహ్‌ సీలు వేస్తాడు’’ అని ప్రవక్త చెప్పారు. ఈదుల్‌ ఫితర్‌ (రంజాన్‌), ఈదుల్‌ అజ్జా (బక్రీద్‌) దినాలకన్నా జుమా రోజు చాలా శ్రేష్ఠమయినది.
 
వారాలన్నింటికీ నాయకుడు శుక్రవారం. జుమా రోజు చేసే దువా (వేడుకోలు) అల్లాహ్‌ స్వీకరిస్తాడు. ప్రత్యేకంగా ఒక్క జుమా రోజే ఉపవాసం ఉండకూడదు. దాంతోపాటు క్రితం రోజు గానీ, ఆ తర్వాత రోజు గానీ కలుపుకొని ఉపవాసం ఉండాలి. భారీ వర్షం వల్ల గానీ లేక ఇంకా ఏ కారణం చేతనైనా జుమా నమాజ్‌ తప్పిపోతే కేవలం నాలుగు రకాత్‌లతో జోహర్‌ నమాజ్‌ మాత్రమే చదవాలి. ఇక మ‌రి రోజూ చ‌దివే జొహ‌ర్ (మ‌ధ్యాహ్న వేళ‌)లో 12 ర‌కాతుల న‌మాజ్ చ‌దివితే శుక్ర‌వారం మాత్రం 14 ర‌కాతుల న‌మాజ్‌ని ఆచ‌రిస్తారు. ఆరోజు కొంచం ఎక్కువ సేపుదేవుడ్ని స్మ‌రిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: