పొదలకూరు మండలం డేగపూడి గ్రామ వాస్తవ్యుడు వలికూటి పెద వెంకటరెడ్డి తన గ్రామంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇంట్లో చేరిన మూడో రోజు నుంచి అతని ఆరోగ్యం పాడైంది. కాళ్ళ వాపు వచ్చింది. వైద్యుడికి చూపించి మందులు వాడుతున్నారు. వళ్ళంతా కూడా వాపు వచ్చింది. ఎన్ని చికిత్స‌లిప్పించినా ఏవీ ఫలితం ఇవ్వలేదు. చివరికి భూత వైద్యం, మంత్రాలు, తంత్రాలు అన్ని ప్రయత్నాలు చేశారు. ఇల్లు మారి వేరే ఇంట్లో కాపురం పెట్ట‌డంతో అనారోగ్యం కొంచెం తగ్గుముఖం పట్టింది. భ‌గ‌వాన్ వెంకయ్యస్వామివారిని సంప్రదిస్తే మంచిది అని కొందరు సలహా ఇచ్చారు. వెంటనే వారి జాడ తెలుసుకొని అతని సోదరుడు చిన వెంకటరెడ్డి వరికుంటపాడులో వున్న స్వామివారిని కలిశాడు. డేగపూడి రమ్మని బ‌తిమలాఢాడు. సరేనని చలమానాయుడు చేత చీటీలు రాయించిచ్చారు స్వామి.

స్వామి చెప్పిన‌ట్లు మ‌గ‌బిడ్డ పుట్టాడు
తరువాత ఇద్దరూ కలిసి డేగపూడి వెళ్లారు. ఆ ఇల్లు చూసి తొమ్మిది మట్టి పిడతలు, రాగి రేకులు వగైరా కావలసిన సామానులు తెప్పించమని చెప్పారు. పెదవెంకటరెడ్డిని పిలిచి ఆ ఇంటి నాలుగు దిక్కుల్లో నాలుగు మూలల్లో ఎనిమిది పిడతలు, పూజాక్షితలతో రాగిరేకులు, మరి కొన్ని వస్తువులు పాతిపెట్టారు. ఒక పిడత ద్వార బంధం కింద పూడ్చి పెట్టారు. అప్ప‌టినుంచి వెంకటరెడ్డి ఆరోగ్యం కుదుటపడింది. పెద వెంకటరెడ్డి ఇంట్లో స్వామివారు చేసిన ప్రక్రియ వల్ల వలన అతడి స్థితి గతులు పూర్తిగా మారిపోయాయి. అతని భార్య ఏనాడో చనిపోయింది. తను అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఇంతకాలం ఎవరినీ వివాహం చేసుకోలేదు. ఇప్పుడు స్వామి ఆశీర్వాదంతో అంతా సవ్యంగా వుంది కనుక స్వామివారిని సంప్రదించి తన భార్య చెల్లెలు పిచ్చమ్మను పెళ్ళి చేసుకున్నాడు. భార్యాభర్తలు స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించారు. అలా  ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. సంతానం కలుగలేదని పిచ్చమ్మ స్వామి వారిని వేడుకుంది. ఏమీ దిగులు పెట్టుకోవద్దు నీకు మగ పిల్లాడు పుడతాడు అని చెప్పారు స్వామివారు. అసలు బ‌తకడు అనుకున్న వెంకటరెడ్డి జీవితం స్వామి వారి ఆశీర్వాదం తో సుఖః సంతోషాలతో సాగిపోయింది. అతను స్వామివారిని అత్యంత విశ్వాసంతో సేవించుకున్న ధన్యజీవి.

మారిపోయిన జీవితం
ఒకరోజు స్వామివారు తలుపులూరు దగ్గర ఉన్నారు. అప్పుడు వారి దగ్గరకు వేలూరు సుబ్రహ్మణ్యం వ‌చ్చి నరసప్పనాయుడి క‌ష్టాన్ని వివ‌రించారు. అప్పుల‌పాల‌య్యార‌ని, ద‌య‌నీయ‌స్థితిలో ఉన్నార‌ని, మీరువ‌స్తే మంచి జ‌రుగుతుంద‌నే ఆశ‌తో ఉన్నార‌ని చెప్పారు. స్వామివారు అంగీకరించారు.  ఏ మైకాగనిలో నష్టం వస్తుందో ఆ చోటుకు సుబ్రమణ్యం స్వామివారిని తీసుకు వెళ్ళాడు. స్వామివారిని చూసి నరసప్పనాయుడు పరిగెత్తుకుని వచ్చి కలుసుకున్నాడు. తాను అనుభవిస్తున్న కష్టాలను విన్నవించుకున్నాడు. మీకేమయ్యా మహారాజులు అని, మీ నాన్న గిరెప్పనాయుడు పెత్తనం అయితే ఎవరూ రారయ్యా... నీ పెత్తనం అయితే ఉత్తరం వైపు చేయి చూపించి వస్తారు అన్నారు. తరువాత కొద్దిరోజులకు కొమరిక గ్రామం నుంచి కోటారెడ్డి వ‌చ్చి  నరసప్పనాయుడు గనిని లీజుకు తీసుకొని చాలా సొమ్ము ఇచ్చాడు. స్వామివారు వచ్చి అడుగు పెట్ట గానే వాళ్ళ దారిద్ర్యం తొలగిపోయింది. ఇలా ఎంతోమందికి స్వామి వారిని ఆశ్రయిస్తే వారి జీవితం మారిపోయింది. ఇలాంటి లీలలు విన్నప్పుడు భక్తులకు స్వామివారిపై విశ్వాసం దృఢపడుతుంది. భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో భ‌గ‌వాన్ వెంక‌య్య‌స్వామివారి లీలలు పారాయణ చేస్తుంటే మన జీవితాలు కూడా వారి ఆశీర్వాదంతో రక్షింప‌బ‌డ‌తాయ‌నేది పై రెండు సంఘ‌ట‌న‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: