ఇండియా క్రికెట్ లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. అయితే గత కొంతకాలంగా టీమిండియా ప్రదర్శన అంతగా బాగాలేదని చెప్పాలి. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ లో రోజు రోజుకి తమ ఆట మరీ తీసికట్టుగా తయారవుతోంది. ఇందుకు ప్రతీకగా ఆసియ కప్ మరియు టీ 20 వరల్డ్ కప్ లలో చేసిన ప్రదర్శనను చెప్పవచ్చు. ఇక తాజాగా బంగ్లా పర్యటనలో ఉన్న ఇండియా మొదటి రెండు వన్ డే మ్యాచ్ లలో ఓడిపోయి సిరీస్ ను ఇప్పటికే పోగొట్టుకుంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఎందుకో ఓటమి పాలయి ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. కాగా ఈ రోజు జరుగుతున్న మూడవ వన్ డే లో మాత్రం అద్భుత ప్రదర్శన చేసి బంగ్లాకు తమ సత్తా ఏమిటో నిరూపించి చూపించింది అని చెప్పాలి.

టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా ఇషాన్ కిషన్ మరియు కోహ్లీ కీలక సమయంలో సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసి బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇషాన్ కిషన్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించి తనకు వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని ఇండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కింగ్ కోహ్లీ సైతం గత మూడేళ్ళ నుండి అందని ద్రాక్షలా మారిపోయిన వన్ డే సెంచరీని కూడా ఈ మ్యాచ్ లో సాధించాడు. అయితే ఇండియా ఒక్క రికార్డ్ కు కొంచెం దూరంలో నిలిచిపోయింది, మరో 10 పరుగులు కనుక చేసుంటే ఇండియా పేరిట వన్ డే లలో ఉన్న అత్యధిక స్కోర్ 418 ను అధిగమించి ఉండేది.

ఇంతకు ముందు 11 సంవత్సరాల క్రితం డిసెంబర్ 8 2011 న వెస్ట్ ఇండీస్ పైన ఇండోర్ లో చేసిన 418 పరుగులే ఇప్పటి వరకు అత్యధికం కావడం విశేషం. ఆ మ్యాచ్ లో అప్పటి వెటరన్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగులు చేసి కరేబియన్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఇక ఈ రికార్డ్ బద్దలవ్వాలంటే ఇంకెంతకాలం వేచిచూడాలి అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక బంగ్లా ఈ స్కోర్ ను ఛేదిస్తుందా ? ఎంతవరకు వెళుతుంది అన్నది తెలియాలంటే ఛేజింగ్ ను ఫాలో అవ్వాల్సిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి: