భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్ర నివాసి అయిన రాంబాబు క్రీడా చరిత్రలో సంచలనం సృష్టించాడు. అతడు మంజు రాణితో కలిసి 2023 ఆసియన్‌ గేమ్స్‌లో క్రీడలలో 35 కి.మీ మిక్స్‌డ్ టీమ్ వాక్‌ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించి భారతీయులందరికీ గర్వకారణంగా నిలిచాడు. అయితే ఈ ఫీట్ సాధించే ముందు అతడు అనేక సవాళ్లను అధిగమించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అతను ఎదుర్కొన్న కష్టాలు ఉన్నప్పటికీ, అచంచలమైన సంకల్పంతో ప్రయాణం ముందుకు సాగించి ఈరోజు అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు.

రాంబాబు తండ్రి ఛోటాలాల్ రైతు కూలీ. ఇతడి కుటుంబం మట్టి ఇంట్లో నివసిస్తుంది. రాంబాబు స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి, నవోదయ విద్యాలయంలో విద్యను అభ్యసించాడు. క్రీడల పట్ల అతని అభిరుచి చిన్న వయస్సులోనే పెరిగింది. అతను 2012 లండన్ ఒలింపిక్స్‌ సమయంలో రన్నర్‌గా మారాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే జీవితాన్ని మార్చేసింది.

అయితే, రాంబాబు తన గ్రామంలో పరిమిత వనరుల వల్ల సరిగా ప్రిపేర్ కాలేకపోయాడు. ఫుట్‌పాత్‌లపై పరిగెత్తడం ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు, చివరికి వారణాసి వెళ్లి ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. వారణాసిలో తన శిక్షణ సమయంలో, రాంబాబు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, పట్టెడన్నం కూడా దొరక్క చాలా కష్టపడ్డాడు. తనను తాను పోషించుకోవడానికి, స్థానిక హోటల్‌లో వెయిటర్‌గా కూడా పనిచేశాడు. అయితే, కరోనా కారణంగా హోటల్ క్లోజ్ కావడంతో తిరిగి, సొంత గ్రామానికి వచ్చాడు.

స్వగ్రామానికి తిరిగి వచ్చిన రాంబాబు ఎంఎన్‌ఆర్‌ఇజిఎ (MNREGA) కార్యక్రమంలో చేరి పనులు చేసి తన కుటుంబాన్ని పోషించాడు. అక్కడ అతను చెరువు తవ్వకంలో సహాయం చేశాడు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత, రాంబాబు మాజీ ఒలింపియన్ బసంత్ బహదూర్ రాణా మార్గదర్శకత్వంలో శిక్షణ పొందేందుకు భోపాల్‌కు వెళ్లాడు.

జాతీయ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో 35 కిలోమీటర్ల రేసు-వాక్‌లో పాల్గొని బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడంతో రాంబాబు అంకితభావం, కృషి ఫలించాయి. ఈ విజయం అతనికి జాతీయ శిబిరంలో స్థానం సంపాదించిపెట్టింది, అతని ప్రయాణంలో ఒక అద్భుతమైన మలుపుగా నిలిచింది.

జాతీయ క్రీడల్లో, రాంబాబు 35 కిలోమీటర్ల నడక ఈవెంట్‌లో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు, దానిని కేవలం 2 గంటల 36 నిమిషాల 34 సెకన్లలో పూర్తి చేశాడు.  అతను సాధించిన విజయానికి బంగారు పతకం కూడా సాధించాడు. ఈ జాతీయ రికార్డు గతంలో హర్యానాకు చెందిన మహ్మద్ జునైద్ పేరిట ఉంది.

రాంబాబు ఫిబ్రవరి 15న రాంచీలో జరిగిన నేషనల్ వాకింగ్ ఛాంపియన్‌షిప్‌లో 35 కిలోమీటర్ల నడకను కేవలం 2 గంటల 31 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసి తన జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ కొత్త రికార్డులను నెలకొల్పుతూనే ఉన్నాడు. అతను మార్చి 25న స్లోవేకియాలో జరిగిన అంతర్జాతీయ పోటీలో కూడా పాల్గొన్నాడు, అదే దూరాన్ని 2 గంటల 29 నిమిషాల 56 సెకన్లలో 35 కి.మీ.

రాంబాబు అద్భుతమైన ప్రయాణం అతని దృఢత్వానికి, దృఢ సంకల్పానికి, రేస్ వాకింగ్ పట్ల అచంచలమైన అభిరుచికి నిదర్శనం. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే అతని విజయాలు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: