
ఏటికేడు పాతాళానికి పడిపోతున్న జలాలు ఈసారి మరింత ప్రమాదకర పరిస్థితులను సూచిస్తున్నాయి. దాదాపు 145 చదరపు కిలోమీటర్ల మేర భూమిలో నీళ్లు 20 మీటర్ల కంటే కిందకు పడిపోయాయని తెలంగాణ భూగర్భ జలాల శాఖ అధికారులు చెబుతున్నారు. నగరంలో ఈసారి అధికంగా వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ నీటి కష్టాలు తగ్గకపోగా.. ఎక్కువకావడం గమనార్హం.
విచ్చలవిడిగా బోర్ల తవ్వకం, చెరువులు, కుంటలను కబ్జా చేయడం, ఎక్కడపడితే అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టడంతో వర్షం నీరు గ్రౌండ్‌వాటర్‌కు చేరకుండానే మూసీ నదిలోకి లేదా డ్రైనేజీ ద్వారా వెళ్లిపోతుంది. హైదరాబాద్‌కి పడమర, దక్షిణ దిక్కుల్లో వేగంగా విస్తరిస్తున్న శేరిలింగంపల్లి, హయత్‌నగర్, సరూర్‌నగర్, కూకట్‌పల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, బాచుపల్లి, దుండిగల్, మల్కాజ్‌గిరి లాంటి మండలాల్లో కొత్త ఇళ్ల నిర్మాణాలు, విచ్చలవిడిగా నోటిని తోడేయడంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోయాయి. అటు పాతబస్తీలోని అంబర్‌పేట, అమీర్‌పేట, చార్మినార్, ఖైరతాబాద్ లాంటి జీహెచ్ఎమ్‌సి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి.
అధికంగా వర్షపాతం నమోదైనా కాంక్రీట్ కట్టడాలతో ఆ నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. మరోవైపు ఏటికేడు నగరంలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. గత పదేళ్లలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం సగటున 2.34 మీటర్లు పెరిగింది. పెరుగుతున్న ఉష్టోగ్రతలకి తోడు వర్షపు నీటి సంరక్షణలో నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర రాజధాని నీటి కష్టాలకు ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికైనా మిల్కొని ఇంజక్షన్ బోర్ వెల్స్, రూప్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి వాననీటి సంరక్షణ పద్దతులను ఫాలో అవ్వడంతో పాటు ఇంకుడు గుంతలు కట్టి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకుంటే.. భూగర్భ జలాలు పెరుగుతాయి. బోర్ల మీద ఆధారపడటం తగ్గుతుంది. నీటి కష్టాలకు దూరంగా కూడా ఉండొచ్చు.