వరుసగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దారుణాలపై సమాజం కలతచెందుతోంది. 'అసలు వీళ్లు మనుషులేనా వీరికి మానవత్వం లేదా' అంటూ నిందితులపై ఆక్రోషం వెల్లగక్కుతున్నారు. నింధితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా ప్రజా సంఘాలు ఆక్రందనను వ్యక్తం చేస్తున్నాయి. కన్నుమిన్ను కానకుండా కామాంధులుగా తయారవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ర్టాల్లో అభం శుభం తెలియని చిన్నారులు మొదలుకొని.. మహిళలపై రోజు రోజుకు లైంగిక దాడులు అధికమవుతున్నాయి. వావి వరసలు లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిర్భయ, దిశ చట్టాలు వచ్చాక కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం.


అది మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామం. ఆ ప్రాంతంలో వరుసగా ఏడు హత్యలు కలకలం సృష్టించాయి. నిర్మానుష్య ప్రాంతంలో ఇటువంటి హత్యలు చోటుచేసుకోవడం పలువురిని భయభ్రాంతులకు గురిచేసింది. ఈనెల 17న జిల్లాలోని దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారు పంటపొలాల్లో ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. నవాబు పేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలు (53)గా ఆమెను గుర్తించారు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాల మేరకు ఆమెపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనుమానించిన ఓ నిందితుడిని కూడా పట్టుకున్నారు. 


పోలీసుల విచారణలో కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. కల్లు దుకాణాలే అడ్డా చేసుకుని అక్కడికి వచ్చిన మహిళలపై కామాంధుడు కన్నేస్తాడు. వీలు చూసుకుని మాట కలుపుతాడు. కీచకుడి వలలో చిక్కితే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్యచేస్తాడు.  నిందితుడి నుంచి ఇటువంటి మాటలు విన్న పోలీసులు నివ్వెరపోయారు. గతంలో కూడా ఈ నిందితుడు కల్లు కాంపౌండ్ వద్ద మాటువేసి మహిళలను ట్రాప్ చేసేవాడని తేల్చారు. తన వలలో చిక్కిన వారిని దూరంగా తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేసేవాడని నిర్ధారించారు. ఈ విధంగా ఏడుగురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘోరానికి పాల్పడింది ఇతను ఒక్కడేనా, వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయాల పై ఆరాతీస్తున్నట్లు సమాచారం. మనిషి రూపంలో ఉన్న ఈ నరరూప రాక్షసుడు ఏడుగురు మహిళలను పొట్టనపెట్టుకోవడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతటి దుర్మార్గుడికి కఠిన శిక్షపడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: