గర్భిణి స్త్రీల రక్తంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉంటే.. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తులో ఊబకాయులుగా మారే అవకాశం ఉందని అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్‌ టెనసీ శాస్త్రవేత్తలు. ప్లాస్‌ వన్‌ పరిశోధన జర్నల్‌లో ప్రచురితమైన తాజా వ్యాసం ప్రకారం.. గర్భం దాల్చినప్పుడు స్త్రీలలో తాత్కాలికంగా కనిపించే మధుమేహాన్ని గుర్తించకపోయినా ఫలితం మాత్రం మారదు. 1995 – 2004 మధ్యకాలంలో కాన్పులైన దాదాపు 40 వేల మంది గర్భిణులను తాము పరిశీలించామని.. పిల్లల వివరాలను కూడా పరిగణలోకి తీసుకున్న తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త సమంత ఎహెర్లిచ్‌ తెలిపారు.

 

ఈ 40 వేల మందికీ 24, 28 వారాల గర్భం ఉన్న సమయంలో రక్తంలోని గ్లూకోజ్‌ మోతాదులను పరిక్షించామని, ఏడేళ్ల వయసుకు చేరేవరకూ పిల్లల వివరాలూ సేకరించామని వివరించారు. పరిశీలన సమయంలో రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువగా ఉంటే.. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ ఉందా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు అదనంగా మరో పరీక్ష చేశామని సమంత తెలిపారు. అయితే సాధారణ చక్కెర మోతాదులు ఉన్న వారితో పోలిస్తే ఎక్కువ ఉన్నవారి పిల్లలు ఊబకాయులయ్యేందుకు 13 శాతం అవకాశం ఉందని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని చెప్పారు.

 

ఒకవేళ ఆ మహిళకు జెస్టేషనల్‌ డయాబెటిస్‌ ఉంటే పిల్లలు ఊబకాయులయ్యేందుకు 52 శాతం అవకాశముందని అన్నారు. ఒకవేళ గర్భిణి స్త్రీల బాడీమాస్‌ ఇండెక్స్‌ సాధారణ స్థాయిలో ఉండి, రక్తంలో గ్లూకోజ్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ పిల్లలకు ఊబకాయం రాలేదన్నది తమ అధ్యయనం చెబుతోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: