
ఇక్కడ జరిగిన ఘటన మాత్రం మరింత విచిత్రమైనది అని చెప్పాలి. చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా చూసే ఉంటారు. అందులో అప్పటికే చనిపోయిన ఒక మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్తే.. డబ్బులు గుంజాలి అనే ఉద్దేశంతో ఎన్నో టెస్టులు చేస్తున్నామని అతని బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నామని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు నాటకం ఆడుతూ ఉంటారు. చివరికి అదంతా నాటకమని వైద్యాధికారులకు కూడా తెలిసిపోతూ ఉంటుంది. కాగా ఇక్కడ ఇలాంటిదే జరిగింది.
ఆసుపత్రి లో శస్త్రచికిత్స వికటించి గర్భిణి మృతి చెందింది. వైద్యులు మాత్రం ఈ విషయం బయటకు చెప్పలేదు. పరిస్థితి విషమించిందని మెరుగైన వైద్యం అందించాలని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులను నమ్మించారు. ఈ ఘటన ఆమనగల్లు పట్టణం లో వెలుగులోకి వచ్చింది. తలకొండపల్లి మండలం లోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవం కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. సిజేరియన్ చేశారు. దీంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శస్త్ర చికిత్స వికటించడంతో నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది. ఈ క్రమంలోనే ఆ విషయం బయటకు చెప్పకుండా హైదరాబాద్లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాము అంటూ నాటకం ఆడారు. కానీ కుటుంబ సభ్యులు నిలదీయడంతో ఎనిమిది లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు వైద్యులు.