రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏపీలో అధికార ప్రతిపక్షాలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. రాష్ట్రం నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ మూడు స్థానాలు వైసీపీకే దక్కే అవకాశం ఉంది. అయితే తమకు బలం లేకపోయినప్పటికీ టీడీపీ కూడా రాజ్యసభ రేసులో ఉన్నామనే సంకేతాలు ఇస్తోంది.


ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు సీట్లలో కనకమేడల రవీంద్ర కుమార్ టీడీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన గడువు ముగుస్తుండటంతో రాజ్యసభలో టీడీపీ తమ ప్రాతినిథ్యాన్ని పూర్తిగా కోల్పోనుంది. రాష్ట్రంలో టీడీపీకి ఉన్న సీట్లను బట్టి చూస్తే ఏమాత్రం రాజ్యసభసీటు దక్కే అవకాశం కనిపించడం లేదు. అయినా తాము కూడా రాజ్య సభ రేసులో ఉన్నామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. దీనిపై తమ లెక్కలు తమకు ఉన్నాయని పేర్కొంటున్నారు.


గతంలో ఏపీ శాసనమండలికి జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా ఒక సీటు దక్కించుకుంది. టీడీపీ తరఫున బరిలో ఉన్న పంచుమర్తి అనురాధ గెలుపొందారు. అయితే ఈ సారి రాజ్య సభ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా వైసీపీ జాగ్రత్త పడుతున్నా టీడీపీ మాత్రం తమకు ఓ సీటు వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకే రాజ్యసభ బరిలో తమ అభ్యర్థిని దింపుతామంటున్నారు.


గత ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలు గెలవగా వారిలో నలుగురు వైసీపీ చెంతకు చేరారు. మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. దీంతో టీడీపీకి 18మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అనర్హత పై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఒక్కో రాజ్యసభ స్థానానికి 41మంది ఎమ్మెల్యేల బలం అవసరం అవుతుంది. అయితే వైసీపీ లో టికెట్ దక్కని అసంతృప్త నేతలతో పాటు తమకు టచ్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలను కలుపుకొని రాజ్యసభలో టీడీపీ దక్కించుకునే ఆలోచనలో ఉంది. మరి జగన్ దీనికి ఎలాంటి ప్రతి వ్యూహాలు పన్నుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: