సీఎం గా తొలిసారి జగన్ ప్రమాణ స్వీకారం చేసి 151 సీట్లలో అత్యంత బలమైన పార్టీగా వైసీపీ అడుగుపెట్టిన 15వ అసెంబ్లీ.. చివరి సమావేశాలతో ముగిసింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. తిరిగి జూన్ లో తామే అధికారంలోకి వస్తామని ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామని జగన్ చెప్పడంతో ఈ సభ చరిత్ర పుటలలోకి ఎక్కింది.


రెండున్నరేళ్ల పాటు సభ జగన్ వర్సెస్ చంద్రబాబులానే సాగింది. కానీ తన కుటుంబాన్ని అవమానించారు అంటూ చంద్రబాబు సభకు నమస్కారం చేసి బయటకు వచ్చేశారు. ఇక అప్పటి నుంచి సభా సమావేశాలు అనుకున్నంత స్థాయిలో జరగలేదు. దీంతో చేసేదేమి లేక సొంత పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర ప్రభుత్వాన్ని తమకు కావాల్సినవి అడిగారు. సభలో జరిగిన జీరో అవర్ లో పలు అంశాలను ప్రస్తావించారు.


నర్సీ పట్నం నియోజకవర్గంలోని నాతవరం నుంచి తాండవ జలాశయం వరకు రోడ్లు బాలేదని  పూర్తిగా గుంతలమయంగా మారిందని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ తెలిపారు. కనీసం మరమ్మతులు అయినా చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పర్వాడ మండలం తాడి వద్ ల్యాండ్ ఫిల్ ఏర్పాటు  చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి ప్రతిపాదించింది అని.. ఆ గ్రామాన్ని అక్కడి నుంచి తరలించే వరకు ఆ ప్రతిపాదన ఆపాలని ఎమ్మెల్యే  రాజు కోరారు.


ప్రత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గరి మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని ఎమ్మెల్యే శ్రీదేవి కోరారు. పాయకరావుపేటలో ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి కావడం లేదని.. పూర్తైన వారికి బిల్లులు చెల్లించడం లేదని ఎమ్మెల్యే బాబురావు గుర్తు చేశారు. తనను రాజ్యసభకు పంపుతున్నట్లు సమాచారం అందిందని అక్కడ కూడా రాష్ట్ర సమస్యలపై గళం విప్పుతానని ప్రకటించారు. బొబ్బిలి నియోజకవర్గంలో అనేక చోట్ల భూ సర్వేలో తప్పులు దొర్లాయని వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే చిన్నప్పలనాయుడు కోరారు. వీరితో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: