సినీ రంగంలో మకుటం లేని మహారాజు చిరంజీవి. ఎటువంటి నేపథ్యం లేకపోయినా.. సినీ పరిశ్రమలో ప్రవేశించి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు.  ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు. వారందిరకీ దిక్సూచీ ఆయనే. సినీ రంగంలో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో అనూహ్యంగా రాజకీయాల్లో ప్రవేశించారు.


కానీ అనుకున్న మేర రాణించలేకపోయారు. తనకు రాజకీయాలు సూట్ కావని తేల్చి చెప్పారు. తిరిగి మళ్లీ సినీ రంగానికే వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు పీక్ స్టేజ్ కి చేరాయి. ఈ సమయంలో ఆయన రాజకీయ ప్రకటనలు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్నటికి మొన్న జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన మెగాస్టార్.. ఇప్పుడు ఏకంగా ఎన్డీయే కూటమికి మద్దతుగా ప్రకటన చేయడం విశేషం. దీంతో ఆయనపై వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.


ప్రస్తుతం చిరంజీవి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకపోయినా మా పార్టీయే అంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు. వాస్తవానికి చిరంజీవిని బీజేపీలోకి తీసుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరిగాయి. ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించిన తర్వాత కచ్ఛితంగా బీజేపీ గూటికి చేరతారు అనే ప్రచారం జోరుగా సాగింది. ఆ మధ్య అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీ చిరంజీవి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జగన్ పక్కనే ఉన్నా మెగాస్టార్ కే అత్యంత ప్రాధాన్యమిచ్చారు.


నేను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని ఆయన చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. కానీ ఎన్నికల ముంగిట ఎన్డీయే కూటమి అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం రాజకీయ దుమారమే రేగింది. ఈ సమయంలో ఆయనకు పలు ప్రశ్నలు అనివార్యంగా ఎదురవుతాయి.  తన ప్రజారాజ్యం పార్టీని ఎందుకు విలీనం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి మళ్లీ మద్దతు ఎందుకు ప్రకటిస్తున్నారు. ఈ పదేళ్ల కాలంలో ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు. అమరావతి, విశాఖ స్టీల్, విభజన హామీలపై ఎందుకు ప్రశ్నించలేదు. వీటిపై ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: