త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ఈసీ నిన్న షెడ్యూల్ ఇచ్చింది. దీంతో కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. అయితే.. ఈ ఎన్నికల్లో ఈసీ కొన్ని కొత్త రూల్స్ పెట్టింది. వాటిలో ఒకటి రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా మారబోతోంది. అదేంటంటే.. ఏ పార్టీ అయినా సరే.. తాము ప్రకటించే ప్రతి అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేసుకున్నామో కారణాలు కూడా చెప్పాలట. గతంలో అభ్యర్థుల నేర చరిత్రను వెబ్ సైట్లో పెట్టాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు దీనికి తోడుగా అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేశామన్నది కూడా వెబ్‌ సైట్లో పెట్టాలని ఈసీ నిబంధన విధించింది.


రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తాయి.. ఇందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేకించి ఇప్పుడు సామాజిక వర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆయా వర్గంలో ఏ సామాజిక వర్గం ఆధిపత్యం ఉంది.. ఏ కులం ఓట్లు ఎక్కువ ఉన్నాయి.. ఏ కులం నేతలు ప్రభావం చూపుతారు.. అనే లెక్కలు వేసుకుని టికెట్ల కేటాయింపు ఉంటుంది. అలాగే... వారసత్వ నేతలు కూడా చాలాచోట్ల ప్రభావితం చూపుతారు. పేరుకు ప్రజాస్వామ్యమే అయినా.. తమ వారసులను రాజకీయాల్లోకి రానీయని నేతలు చాలా అరుదు.


అందువల్ల పార్టీ టికెట్లలో కనీసం 30 శాతం వారసులకే పోతాయి. ఆ తర్వాత అభ్యర్థి ఎంత ఖర్చు చేయగలడన్నది కూడా మరో ప్రాధాన్య అంశంగా మారింది. కేవలం ప్రజాసేవ, ప్రజల్లో ఇమేజ్‌ అన్నది కాకుండా.. ఆ అభ్యర్థి దండిగా ఖర్చు చేయగలుగుతాడా.. కోట్లు కుమ్మరించగలుగుతాడా లేదా.. ఓట్లు కొనగలిగే సామర్థ్యం ఉందా లేదా అన్నది కూడా ముఖ్యాంశంగా మారింది. మరి ఇన్ని కీలక అంశాలు ఉంటే.. రాజకీయ పార్టీలు ఏ అంశం మేరకు ఏ అభ్యర్థిని ఎంపిక చేశామని ఎలా వివరణ ఇస్తాయన్నది ఆలోచించాల్సిందే.


అయితే.. తాము ఏ ప్రాతిపదికన ఎంపిక చేసినా.. సదరు అభ్యర్థి మహా గుణవంతుడని.. ప్రజాసేవాతత్పరుడని.. ఆయన్ను మించిన అభ్యర్థి మాకు కనిపించలేదని పార్టీలు వివరణ ఇచ్చినా కాదనేవారు ఎవరుంటారు.. అంతే.. పార్టీలు ఆ పని చేసే అవకాశాలే ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: