జమ్మూ కాశ్మీర్.. ఇండియాలోనే ప్రత్యేకమైన రాష్ట్రం.. పాకిస్తాన్‌కు ఇండియాకు మధ్యన ఉన్న రాష్ట్రం. ఇది ఇండియాకు తలలాంటి రాష్ట్రం.. అయితే.. అనేక ప్రత్యేక పరిస్థితుల మధ్య ఇండియాలో విలీనం అయిన ఈ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు, నిబంధనలు ఉండేవి.. అవి ఎంత క్లిష్టంగా ఉండేవంటే.. దేశంలో ఎక్కడా లేని రూల్స్, ప్రత్యేక నిబంధనలు జమ్మూకాశ్మీర్ వాసులకు ఉండేవి.. అలాంటి రూల్స్‌లో ఒకటి.. ఇక్కడ వేరే రాష్ట్రాల వాళ్లు వచ్చి భూములు కొనకూడదు అనే నిబంధన. ఇలాంటి ప్రత్యేకమైన రూల్స్ అనేకం ఆర్టికల్ 370 ద్వారా లభించాయి.


అయితే.. ఈ ప్రత్యేక నిబంధనల కారణంగానే జమ్మూ కాశ్మీర్ అభివృద్ది చెందలేదన్న వాదన కూడా ఉంది. అయితే.. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రత్యేకతలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఇండియాలోని ఎవరైనా ఇక్కడ భూములు కొనుక్కోవచ్చు. ఈ నిబంధనలు సడలించిన తర్వాత ఇతర రాష్ట్రాలకు చెందిన 34 మంది జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్రం తెలిపింది. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు హాజీ ఫజ్లూర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇలా సమాధానం చెప్పింది.


పార్లమెంట్‌లో హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విషయాన్ని పై ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ బయటి నుండి 34 మంది జమ్మూ, రియాసి, ఉధంపూర్, గందర్‌ బల్ జిల్లాల్లో  ఆస్తులను కొన్నారట. జమ్మూ కాశ్మీర్‌లో పటిష్టమైన భద్రత, ఇంటెలిజెన్స్ గ్రిడ్ అమల్లో ఉన్నాయని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులను అడ్డుకునేందుకు తీస్కుంటున్న చర్యలను కూడా కేంద్ర మంత్రి వివరించారు.


నాకాస్, రోడ్ ఓపెనింగ్ పార్టీలలో 24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తున్నామని.. వ్యూహాత్మక పాయింట్ల వద్ద భద్రతను మరింతగా పెంచామని కేంద్ర మంత్రి సమాధానం తెలిపారు. గతేడాది డిసెంబర్ లో, జమ్మూ కశ్మీర్ వెలుపలి నుండి ఇద్దరు వ్యక్తులు, 2019 ఆగస్టులో ఒక ఆస్తిని ఇతరులు కొన్నారని కేంద్రం పార్లమెంటుకు గతంలో తెలిపింది. అంటే ఇక్కడ భూములు కొనేవారి సంఖ్య పెరుగుతోందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: