ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో స్వల్పంగా మార్పులు మాత్రమే చేసింది. ఈ మేరకు జాబితాను నిన్నటి మంత్రివర్గ సమావేశానికి అధికారులు వివరాలు సమర్పించారు.
ఒకటి రెండు మార్పులతో తుది నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా నరసాపురం, రాజంపేట, మార్కాపురం, హిందూపురం జిల్లాలు కావాలని ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆందోళనలు వచ్చాయి.


అయితే.. జగన్ మాత్రం వాటిని పట్టించుకున్నట్టు లేదు. భీమవరం కేంద్రంగానే పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటు కాబోతోంది. అలాగే బాలకృష్ణ నిరాహార దీక్ష చేసినా.. హిందూపురం జిల్లా సాకారం కావట్లేదు.. పుట్టపర్తి కేంద్రంగానే శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడబోతోంది. అలాగే రాజంపేట కోసం ఎంత ఆందోళనలు చేసినా రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లా ఏర్పాటు కాబోతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అనేక అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంది. ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించింది.


అయితే.. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలో నిబంధనను ప్రభుత్వం పక్కనపెట్టి మార్పులు చేసింది. పలు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాల్లో మార్పులు చేసింది. కొత్తగా 24 రెవెన్యూ డివిజన్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త వాటితో కలుపుకుని రెవెన్యూ డివిజన్లు 73కు చేరాయి. అత్యధికంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో 4 చొప్పున రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న 4 రెవెన్యూ డివిజన్లలో 3 కొత్తగా ఏర్పాటైనవే కావడం విశేషం.


6 మండలాలతో కుప్పం, 7మండలాలతో నగరి, 8 మండలాలతో పలమనేరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో ఉయ్యూరు, పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి డివిజన్‌కు ఆమోదం లభించింది. బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాల డివిజన్లకు ప్రభుత్వం ఆమోదం లభించింది. ఈ కొత్త జిల్లాలు ఏప్రిల్‌ 4 నుంచి అమలులోకి రాబోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: