కొత్త జిల్లాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.. 26 జిల్లాలు కొలువు దీరాయి. కానీ ఇంకా కొన్ని చోట్ల మాత్రం ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి.  రాష్ట్రంలో అనేక చోట్ల నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించలేదని కొన్ని చోట్ల గోల చేస్తుంటే.. జిల్లా కేంద్రంగా తమ ప్రాంతాన్ని ఎంపిక చేయలేదని మరికొన్ని చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అవి ఎక్కడెక్కడో చూద్దాం..


నరసాపురం జిల్లా కేంద్రం కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో 62 రోజుల పాటు దీక్షలు చేసినా తమను పట్టించుకోలేదని ఆ పట్టణ వాసులు గుర్రుగా ఉన్నారు. జిల్లా కేంద్రం సాధించలేక పోయినందుకు క్షమించాలంటూ జేఏసీ కన్వీనర్ నెక్కంటి సుబ్బారావు  పాపం.. కన్నీరు పెట్టుకున్నారు. నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం కాకపోవడానికి అసలు కారణం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు అసమర్థతే అంటున్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు.

 
ఇంకా.. ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయలేదన్న అసంతృప్తి అక్కడ ఎక్కవగా ఉంది. జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. ఇక.. నెల్లూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ కందుకూరులోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. కొందరు టీడీపీ నేతలైతే.. తాము అధికారంలోకి రాగానే కందుకూరును మళ్లీ ప్రకాశం జిల్లాలోనే కలుపుతామంటున్నారు. అలాగే.. పల్నాడు జిల్లాకు గురజాలను కేంద్రం చేయనందుకు కూడా ఆ ప్రాంతం వారు గుర్రుగా ఉన్నారు.


అందుకే గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అసలు పల్నాడు చరిత్రతో సంబంధం లేని నరసరావుపేటను జిల్లా కేంద్రంగా ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు అక్కడి నాయకులు. ఇక నర్సీపట్నాన్ని జిల్లా చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయలేదని అక్కడ కూడా రచ్చరచ్చ జరుగుతోంది. మరోవైపు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టనందుకు నిరసనగా రాజోలులో దళిత నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. అంబేడ్కర్ జిల్లాగా ప్రకటించే వరకూ ఉద్యమం ఆపేదిలేదంటున్నారు. ఈ నెల 9న కోనసీమ బంద్‌ నిర్వహిస్తామంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: