
మరోసారి నాజీలపై పోరాటం చేస్తున్నామని... మాతృ భూమిని కాపాడుకునేందుకు యుద్ధం చేయాలన్న పుతిన్ పిలుపు ఇచ్చారు. దీంతో ఉక్రెయిన్‌లోని ఒడిసె నగరంపై మాస్కో సేనలు విరుచుకుపడ్డాయి. పెద్దఎత్తున క్షిపణి దాడులు చేశాయి. ఒడిసెలో పెద్ద సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. నల్ల సముద్రం పరిధిలో భారీ ఓడరేవు ఒడెసాలోనే ఉంది. అక్కడి నుంచే వ్యవసాయ ఉత్పత్తులను ఉక్రెయిన్ ఎగుమతి చేస్తోంది.
అందుకే కీలకమైన ఒడెసాపై దాడి చేయాలని రష్యా టార్గెట్‌గా పెట్టుకుంది. దీనిపై మొత్తం ఏడు క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఓ షాపింగ్ సెంటర్, మరో డిపో ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో చనిపోయినట్టు తెలుస్తోంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకెల్ సోమవారం ఒడెసాలో పర్యటించారు. అందుకే దాడులకు ఇదే అదనుగా రష్యా భావించింది.
ఈ దాడులు కారణంగా ఉక్రెయిన్ ప్రధానమంత్రి డేనిస్‌తో చార్లెస్ మైకేల్ సమావేశానికి ఆటంకం కలిగింది. చివరకు బాంబు షెల్టర్‌లో వీరు సమావేశమై ఎగుమతులపై చర్చించాల్సి వచ్చింది. ఓడరేవు నగరం మరియుపోల్ పైనా రష్యా దాడులు కొసాగస్తోంది. అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటు స్వాధీనం కోసం రష్యా సైన్యం పోరాటం కొనసాగిస్తోంది. ఈ ప్లాంట్‌లో వందలాది ఉక్రెయిన్ సైనికులు దాగి ఉన్నారని రష్యా భావిస్తోంది. అంతే కాకుండా లుహాన్‌స్క్, ఖార్కివ్, నిప్రో నగరాల్లోనూ రష్యా సేనలు యుద్ధ సైరన్లు మోగిస్తూ దాడులతో విరుచుకుపడుతున్నాయి.