
అయితే.. ఈ విషయంపై ఇండియా క్లారిటీ ఇచ్చేసింది. గొటబాయ ప్రయాణానికి భారత్ సహకరించిందంటూ శ్రీలంకలోని కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలు నిరాధారమని తెలిపింది. ఈ మేరకు శ్రీలంక దేశంలోని భారత హైకమిషన్ వివరణ ఇచ్చింది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శ్రీలంక దేశాన్ని విడిచివెళ్లినట్లు వార్తలు వస్తున్నాయని.. అయితే.. ఆయన దేశం దాటే విషయంలో ఇండియా సహకరించిందనే వార్తల్లో వాస్తవం లేదని వివరించింది.
ఇవన్నీ నిరాధార, ఊహాజనిత వార్తలేనని.. వీటిని భారత హైకమిషన్ వీటిని నిర్ద్వందంగా ఖండించిందని శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఇదే సమయంలో కష్ట సమయంలో శ్రీలంకకు ఇండియా సాయం కొనసాగుతుందని హైకమిషన్ తెలిపింది. శ్రీలంక ప్రజలకు భారత్ మద్దతు కొనసాగుతుందని హైకమిషన్ మరో మారు క్లారిటీ ఇచ్చింది.
ఇక శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ మాల్దీవుల్లోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్లు వార్తలు వస్తున్నాయి. గొటబాయ దేశం వీడిన విషయాన్ని శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించడం విశేషం. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే రాజపక్ష దేశం విడిచిపోయినట్టు తెలిసింది. గొటబాయ తన భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాలే వెళ్లినట్టు భావిస్తున్నారు. అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతానని గొటబాయ అంతకు ముందే ప్రకటించారు. కానీ జనాగ్రహం ఓ రేంజ్‌లో ఉంది. అందుకే భద్రత కోసం ఆయన దేశం విడిచి పారిపోయినట్టు భావిస్తున్నారు. ఇక ఇప్పడు ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.