విశాఖలో భూదందాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎంకు రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది.  2004 సంవత్సరం నుంచి అప్పటి  ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన భూదందా  2014 లో రాష్ట్ర విభజన తర్వాత  2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన వరకు సాగిందని సోము వీర్రాజు తన లేఖలో తెలిపారు. విశాఖలో  భూకబ్జాలు జరిగాయని గతంలో వైసీపీ పార్టీవారూ ఆరోపించిన విషయాన్ని సోము వీర్రాజు తన లేఖలో ప్రస్తావించారు. 2019 నుంచి ఇప్పటివరకు  ప్రభుత్వంలోనూ అక్రమ భూ కేటాయింపులు,  అవకతవకలు,  అక్రమ, చట్ట వ్యతిరేక లావాదేవీలు  జరిగాయని విపక్షాలూ, మీడియా పుంఖాను పుంఖాలుగా ఆరోపణలు చేస్తున్నాయని సోము వీర్రాజు గుర్తు చేశారు.


అప్పటి కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, నేటి వైసీపీ  ప్రభుత్వాల్లో పాలకులు, నాయకులుగా మారిన  కొందరు శాసనసభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు అందరూ కలిసికట్టుగా ప్రజలను దోచే విషయంలో ఏకమయ్యారని సోము వీర్రాజు తన లేఖలో తెలిపారు. నాటి తెలుగుదేశం  ప్రభుత్వం భూ కబ్జాలపై విచారణకు 'సిట్' వేసినా కమిటీ నివేదిక బహిర్గతం కాకుండానే ఎన్నికలు వచ్చాయని సోము వీర్రాజు తెలిపారు.


ఆ తరువాత అధికారానికి వచ్చిన‌ వైసీపీ అంతకు ముందిచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వ దురాక్రమణలపై  పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తారని ప్రజలు వేచి చూశారని...  ప్రభుత్వం వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా విచారణలోని అంశాలను ఎందుకు బహిర్గతం చేయట్లేదని సోము వీర్రాజు లేఖలో ప్రశ్నించారు. నాటి సిట్ నివేదిక‌ ఏమైందని సోము వీర్రాజు నిలదీశారు.  2004 నుంచి 2022 వరకు జరిగిన భూభాగోతాలపై జరిపించిన దర్యాప్తు నివేదికలను బయట పెట్టాలని.. ప్రభుత్వానికీ, అసలు యజమానులకూ భూములు బదలాయించాలని సోము వీర్రాజు కోరారు.


యూపీలో ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ తన పర భేదం లేకుండా అక్రమార్కుల భరతం పడుతున్నారని...అలా ఏపీలోనూ చేయాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ప్రజాక్షేత్రంలో  దోషిగా నిలబెట్టి.. సిబిఐ దర్యాప్తు కోసం పోరాటం చేస్తామని అంటున్నారు. ఈ వాదనలోనూ వాస్తవం ఉంది. మరి వైసీపీ సర్కారు సిట్‌ రిపోర్టులను బయటపెడితే.. అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: