అగ్రరాజ్యాధి నేత డొనాల్డ్ జే ట్రంప్ ఇన్ని రోజులకు కళ్ళు తెరిచాడు. కరోనా వైరస్ దెబ్బకు  యావత్ దేశం కుదేలవుతున్న సమయంలో  నేషనల్ ఎమర్జెన్సీని విధించాడు ట్రంప్. ఒక విధంగా చెప్పాలంటే చేతులు కాలిన ఆకులు పట్టుకున్నరాన్న సామెతను గుర్తుకు తెస్తున్నా ఇప్పటికైనా మంచిపని చేశాడు. దాదాపు నెల రోజుల ముందే కరోనా వైరస్ నియంత్రణకు అమెరికాలో గట్టి చర్యలు తీసుకుని ఉంటే ఇపుడీ పరిస్ధితి తలెత్తుండేది కాదన్నది వాస్తవం.  మొదట్లో ఏమో వైరస్ వ్యాప్తి విషయంలో ట్రంప్ తో పాటు జనాలు కూడా చాలా నిర్లక్ష్యం చూపారు. అదే వాళ్ళ కొంప ముంచేసింది.

 

అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచ చరిత్రలో కూడా ఎప్పుడూ లేనంతగా ఒక వైరస్ కారణంగా లక్ష మరణాలు, లక్షాలాది బాధితులుగా మారటం ఇప్పటికీ ఎవరూ నమ్మలేకున్నారు. చైనాలో పుట్టిన కరోనా మొత్తం ప్రపంచాన్నే ఇపుడు వణికించేస్తోంది. చైనా దెబ్బకు ముందు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్ లాంటి దేశాలు బలైపోయాయి. అప్పుడు కూడా అమెరికా మేల్కోలేదు. పై దేశాల్లో వైరస్ సమస్య తీవ్రత పెరిగిపోయిన రోజుల్లో కూడా ఆ దేశాల నుండి అమెరికాకు విమానాలు యధేచ్చగా తిరిగాయి.

 

అమెరికాలో సమస్య పెరిగిపోవటానికి ట్రావెల్ బ్యాన్ పెట్టకపోవటమే అని ఇపుడు ట్రంప్ చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. అందులో పై దేశాల నుండి వచ్చిన వారంతా న్యూయార్క్, న్యూజెర్సీల్లోనే ఉండటంతో పై రాష్ట్రాల్లోనే బాధితులు, మరణాలు కూడా పెరిగిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో బాధితులైనా మరణించిన వారైనా అమెరికాలోనే ఎక్కువగా రికార్డయ్యారు. ప్రపంచం మొత్తం మీద సుమారు 17 లక్షల మంది బాధితులుంటే అమెరికాలో మాత్రమే 5.5 లక్షల మందున్నారు. అలాగే మొత్తం మీద 1.04 లక్షల మంది చనిపోతే అమెరికాలో మాత్రమే 21 వేలమంది చనిపోయారు.

 

పై  గణాంకాలను బట్టే అమెరికాలో సమస్య ఎంత తీవ్రంగా అర్ధమైపోతోంది. పోనీ ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుందా అంటే గ్యారెంటీ ఏమీ లేదు. ఎందుకంటే ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాడు కానీ వ్యవహారాలన్నీ యధేచ్చగానే సాగుతున్నాయి. ఎవరిళ్ళల్లోనే వాళ్ళను కూర్చోమని చెబుతున్నా జనాలు తిరుగుతున్నారు. ఇప్పటికీ న్యూయార్క్-ఇతర రాష్ట్రాల నుండి రాకపోకలు సాగుతునే ఉన్నాయట. అలాగే న్యూజెర్సీ నుండి కూడా రోడ్డు మార్గంలో ప్రయాణాలు జరుగుతునే ఉన్నాయని సమాచారం.

 

అంటే ఒకవైపు కొంపలు ముణిగిపోతున్నా జనాలు వైరస్ తీవ్రతను ఇప్పటికీ సీరియస్ గా తీసుకోలేదని అర్ధమైపోతోంది. డిపార్ట్ మెంటల్ స్టోర్లలో వ్యాపారాలు జరుగుతునే ఉన్నాయట. ఆన్ లైన్లో కొనేవాళ్ళు కొంటున్నారు బయటకు వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటునే ఉన్నారు. అంటే మనదేశంలో లాగ లాక్ డౌన్ ను గట్టిగా అమలు చేయటం లేదని తెలిసిపోతోంది. అందుకనే బాధితులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. అధ్యక్షుడే చెప్పినట్లు అమెరికాను దేవుడే కాపాడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: