వైసీపీ- బీజేపీ.. ఈ రెండు పార్టీల మధ్య బాంధవ్యం ఏంటో ఒక పట్టాన అర్థం కావడం లేదు. మరీ ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే వైసీపీ తీవ్రమైన ఆరోపణలు చేయడంతో తాజాగా రాజకీయం మరింత రసకందాయంలో పడింది. మొదటి నుంచి వైసీపీ- బీజేపీ సంబంధాలు బాగానే ఉంటున్నాయి. రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా కేంద్రంలో ఈ రెండు పార్టీల మధ్య మంచి అవగాహన ఉంది. ఈ క్రెడిట్ అంతా విజయసాయిరెడ్డికే దక్కుతుందని రెండు పార్టీల నేతలు అంటుంటారు.

 

 

ఒక దశలో జగన్ ఏంచేసినా కేంద్రంలోని పెద్దలకు చెప్పే చేస్తున్నారని ఏకంగా విజయసాయిరెడ్డే అన్నారు. అయితే జాతీయ స్థాయిలో ఇంత అవగాహన ఉన్నా.. రాష్ట్రం స్థాయిలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తీరుపై వైసీపీ నేతల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు జేబులో బొమ్మ మాదిరిగా తయారయ్యారన్నది వీరి ఆరోపణ. ఇక ఇప్పుడు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తాజాగా కన్నాపై తీవ్ర ఆరోపణలు చేశారు.

 

 

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి ఇరవై కోట్లకు అమ్ముడు పోయాడని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో చంద్రబాబుకూ, కన్నా లక్ష్మీనారాయణకూ మధ్యవర్తిత్వం చేశాడని విజయసాయిరెడ్డి అంటున్నారు. అందువల్లే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కన్నా వ్యవహరిస్తున్నాడని ఆయన అన్నారు. కేంద్ర పార్టీ వైఖరికి భిన్నంగా కన్నా ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయననే అడిగి తెలుసుకోండని మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా అన్నారు.

 

 

మరోవైపు బీజేపీ ఏపీ శాఖ విజయసాయిరెడ్డిపై అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. కన్నాపై విజయసాయిరెడ్డి ఆరోపణలను ఖండించింది. విజయసాయిరెడ్డి అవినీతి నాయకుడు, ఢిల్లీలో దళారి అంటూ ఏపీ బీజేపీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరి కేంద్రంలో నెయ్యం, రాష్ట్రంలో కయ్యం అన్నట్టుంది బీజేపీ-వైసీపీ బంధం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: