క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  జగన్మోహన్ రెడ్డి   ఒకవైపు కరోనా వైరస్ నియంత్రణకు నానా అవస్తలు పడుతున్నాడు. వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బాధితుల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. అదే సమయంలో జగన్ ను టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాల నేతలు ప్రతి రోజు రెచ్చిపోతున్నారు. ఈ సమయంలో సొంత పార్టీ ఎంఎల్ఏలు కూడా జగన్ కు తలనొప్పులు తెస్తున్నట్లే ఉంది.

 

వైరస్ కు మందు లేదు కాబట్టి  ముందు జాగ్రత్త ఒకటే మార్గం. అందుకనే ఎవరిళ్ళల్లో వాళ్ళను ఉండమని చెప్పి లాక్ డౌన్ విధించారు. అలాగే సామాజిక దూరాన్ని పాటించాలని పదే పదే నెత్తి నోరు మొత్తుకుంటున్నాయి ప్రభుత్వాలు. మరి ఈ నేపధ్యంలో వైసిపి వాళ్ళు ఏమి చేస్తున్నారు ? మొన్నటికి మొన్న శ్రీకాళహస్తి ఎంఎల్ఏ బియ్యపు మదుసూధన రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్ల మీద ప్రభుత్వాలకు నిధులిచ్చిన దాతల ఫొటోలు పెట్టి పట్టణంలో ఊరేగింపు జరిపారు. ట్రాక్టర్ల మీద ఊరేగింపంటే మరి జనాలు కూడా ఉండాల్సిందే కదా ?

 

ఎప్పుడైతే జనాలను పోగేసి ఊరేగింపు జరిపారో తర్వాత టెస్టులు చేస్తే అందులో కొందరికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది.  అలాగే కర్నూలులో ఎంఎల్ఏ హఫీజ్ ఖాన్ పైన మరో రకమైన ఆరోపణలున్నాయి.  ఢిల్లీలో ప్రార్ధనలకు వెళ్ళొచ్చిన వాళ్ళని క్వారంటైన్ సెంటర్లకు పంపకుండా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించాడని ఆరోపణలున్నాయి. వైద్యం చేసిన డాక్టర్ కరోనాతోనే చనిపోయాడు. అలాగే డాక్టర్ కుటుంబసభ్యులతో పాటు ఆసుపత్రి స్టాఫ్ కు కూడా వచ్చిందంటున్నారు. సరే ఆరోపణలు వచ్చిన తర్వాత ఎంఎల్ఏ ఖండించటం మామూలే కదా ?

 

అలాగే గుంటూరు తూర్పు ఎంఎల్ఏ ముస్తఫా మీద కూడా ఇటువంటి ఆరోపణలే ఉన్నాయి. ఢిల్లీకి వెళ్ళొచ్చిన వాళ్ళని క్వారంటైన్ సెంటర్లకు పంపలేదని, బావమరిది కోసం భారీ డిన్నర్ ఇచ్చాడనే ఆరోపణలున్నాయి. కర్నూలు, గుంటూరులో కేసులు బాగా ఎక్కువగా ఉండటంతో  వీళ్ళపై వినిపిస్తున్న ఆరోపణలు నిజమే అని అనిపిస్తున్నది. ఇదే విషయాలపై ప్రతిపక్షాలు జగన్ ను పదే పదే టార్గెట్ చేస్తుండటం గమనార్హం.

 

అదే సమయంలో బెంగుళూరు నుండి లాక్ డౌన్ ను కూడా లెక్క చేయకుండా ప్రకాశం జిల్లా  కనిగిరి ఎంఎల్ఏ మదుసూధనయాదవ్ ఓ 35 మందిని వేసుకుని కార్లలో ఏపిలో ఎంటర్ అవ్వటాన్ని ఏ విధంగా  చూడాలి ?  పైగా మదనపల్లి దగ్గర  అడ్డుకున్న పోలీసులతో పెద్ద గొడవేసుకున్నాడు. అంటే అధికార పార్టీ ఎంఎల్ఏలే నిబంధనలను ఉల్లఘిస్తున్న విషయం స్పష్టమవుతోంది. అంటే సొంత పార్టీ ఎంఎల్ఏల నుండే జగన్ కు తలనొప్పులు పెరిగిపోతున్న విషయం అర్ధమవుతోంది. దీన్ని గనుక మొదట్లోనే అడ్డుకోకపోతే జగన్ కు తలనొప్పులు పెరిగిపోవటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: