ఏపీలో అధికార వైసీపీలో రాజకీయం రోజుకో ర‌కంగా రంగులు మారుతోంది. ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీ  నేత‌ల అరెస్టులు.. వారికి కౌంట‌ర్లు ఇవ్వ‌డాలు... మ‌రో వైపు కేబినెట్ స‌మావేశం... మ‌రో వైపు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల హ‌డావిడి... ఇక కోర్టుల కేసులతో పాటు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న, కొత్త మంత్రులు ఎవ‌రు ? అన్న వార్తలు ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లో బాగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇక దీనిపై వైసీపీలో చర్చలు అయితే జరుగుతున్నాయి. కేబినేట్ లోకి సిఎం జగన్ ఎవరిని తీసుకుంటారు అనే అంశంపై అందరిలో కూడా ఒక ఆసక్తి అనేది ఉంది. ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ కూడా రాజ్యసభకు వెళ్తున్నారు. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నారు. వీరిద్ద‌రు బీసీ వ‌ర్గాల‌కు చెందిన వారే.

 

ఇక వారితో పాటుగా మరో ముగ్గురు, న‌లుగురు మంత్రుల ప‌నితీరు విష‌యంలో జ‌గ‌న్ సంతృప్తిగా లేర‌ని అంటున్నారు. న‌లుగురు మంత్రుల సంగ‌తి ఎలా ఉన్నా జ‌గ‌న్ మాత్రం ఖ‌చ్చితంగా ఇద్ద‌రు మంత్రుల‌ను అయితే త‌ప్పించేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార‌ని అంటున్నారు. వీరిలో గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఓ సీనియ‌ర్ మంత్రి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అయితే సామాజిక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న్ను త‌ప్పించినా అదే వ‌ర్గానికి చెందిన మ‌రో ఎమ్మెల్యేకు ఆ ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

 

ఇక క‌మ్మ సామాజిక వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతం కేబినెట్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్ర‌మే ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న‌తో పాటు మ‌రో క‌మ్మ ఎమ్మెల్యేకు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అంటున్నారు. వాస్త‌వంగా చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మండ‌లిపై జ‌గ‌న్ దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో ఇప్పుడే అదే వ‌ర్గం నుంచి మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల పేర్లు మంత్రి ప‌ద‌వి రేసులో వినిపిస్తున్నాయి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, అదే విధంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లలో ఎవ‌రో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ద‌క్కే ఛాన్స్ ఉంటే ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

 

వీరి ఇద్దరి విషయంలో సిఎం జగన్ ముందు నుంచి సానుకూలంగానే ఉన్నారు.  కొఠారు అబ్బయ్య... చింతమనేని ప్రభాకర్ ని ఓడించగా...  వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమాను ఓడించారు. ఇక రాయ‌ల‌సీమ‌కు చెందిన మ‌రో మంత్రిని కూడా తొల‌గిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఓవ‌రాల్‌గా కొత్త కేబినెట్లో ఒక రెడ్డి, ఒక క‌మ్మ‌, ఇద్ద‌రు బీసీలు ఉండే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: