కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో విశాఖ నేత‌ల త‌ల ‌రాత‌లు మార‌తాయా ?  ఇప్ప‌టి వ‌ర‌కు చ‌క్రాలు తిప్పిన నాయ‌కులు మైన‌స్ కావ‌డం, కొత్త‌వారికి ప్ల‌స్‌లు కావ‌డం ఖాయ‌మేనా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడున్న విశాఖ జిల్లా రేపు జిల్లాల ఏర్పాటుతో మూడు ముక్క‌లుగా మార‌నుంది. పార్ల‌మెంటు స్థానాల ప్రాతిప‌దిక‌న ఏర్ప‌డుతున్న జిల్లాల నేప‌థ్యంలో విశాఖ‌లో ఇప్పటికే రెండు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. అన‌కాప‌ల్లి, విశాఖ‌. ఈ రెండు జిల్లాలుగా ఏర్ప‌డితే విశాఖ రాజ‌కీయ ముఖ‌చిత్రం పూర్తిగా మారిపోనుంది. 

 

లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటుతో ‘విశాఖ’లో రాజకీయంగా అనేక మార్పులు జరుగుతాయి. విశాఖ జిల్లా నగరం, గ్రామీణ మైదాన ప్రాంతం, ఏజెన్సీ.... మూడు ముక్కలవుతుంది. నాయకుల ప్రాబల్యం కూడా అదే ప్రాంతాలకు పరిమితమవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో చక్రం తిప్పిన  సీనియర్‌ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, పప్పల చలపతిరావు వంటి వారు అనకాపల్లి జిల్లాకు పరిమితమవుతారు.

 

ప్ర‌స్తుతం అరకు ఎంపీగా ఉన్న  గొడ్డేటి మాధవి, పసుపులేటి బాలరాజు, గిడ్డి ఈశ్వరి, కుంభా రవిబాబు తదితరులు గిరిజన ప్రాంతంపై పట్టు సాధిస్తారు. ఇక.. మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు, మాజీ మంత్రి గంటా శ్రీనిససరావు తదితరులు ‘విశాఖ’ జిల్లాకు పరిమతమవుతారు. అయితే, ప్ర‌ధానంగా జిల్లా వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు చ‌క్రం తిప్పిన అవంతి శ్రీనివాస‌రావు, గంటా శ్రీనివాస‌రావు వంటివారికి ఈ విభ‌జ‌న ఎఫెక్ట్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. దీంతో విశాఖ క‌నుక రేపు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల నేప‌థ్యంలో విడిపోతే.. నేత‌ల త‌ల‌రాత‌లు మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

అదే స‌మ‌యంలో విశాఖ జిల్లాలోకి విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ఎస్‌.కోట నియోజ‌క‌వ‌ర్గం కూడా వ‌చ్చి చేరుతుంది. ఆ నియోజ‌క‌వ‌ర్గం విశాఖ లోక్‌స‌భ ప‌రిధిలో ఉంది. ఇక నిన్న‌టి వ‌ర‌కు విశాఖ జిల్లా రాజ‌కీయాన్ని త‌మ గుప్పిట పట్టిన గంటా శ్రీనివాస‌రావు లాంటి వారికి పూర్తిగా చెక్ ప‌డ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: