అధికార వైసిపిలో నరసాపురం ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు తిరుగుబాటు జెండా ఎగరేశాడన్న విషయం అందరికీ తెలిసిందే. స్పష్టమైన కారణం ఏమిటో తెలీదు కానీ జగన్మోహన్ రెడ్డి తో ఎంపికి చెడిందన్నది మాత్రం వాస్తవం. దాంతో ప్రతిచిన్న విషయాన్ని బూతద్దంలో చూడటం, ప్రతి అంశానికి జగన్ తో ముడిపెట్టడాన్ని ఎంపి అలవాటుగా చేసుకున్నాడు. పనిలో పనిగా చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే మీడియాలో వ్యక్తిగతంగా జగన్ను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తు రెచ్చిపోతున్నాడు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానంకు చెందిన రథం మంటల్లో తగలబడిన విషయం అందరికీ తెలిసిందే.





ఇదే విషయమై ఎంపి మాట్లాడుతూ తొందరపాటు వ్యాఖ్యలు చేసేశాడు. రథం తగలబడిన విషయానికి మతం రంగును కూడా పులిమేశాడు. అంటే జగన్ను నేరుగా క్రిస్తియన్ అని చెప్పకుండానే రథం కాలిపోయిన విధానాన్ని చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయంటూ ఆరోపించాడు. ఒకేసారి రథం క్రింద నుండి పై దాకా తగలబడిన విధానం చూస్తుంటే రాజుగారికి కుట్రకోణం దాగుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయట. షార్ట్ సర్క్యూట్ వల్ల మాత్రం రథం తగలబడలేదని రాజుగారు కుండబద్దలు కొట్టకుండానే నిర్ధారించేశాడు. ఎంపి అనుమానాలకు, నిర్ధారణకు ఆధారాలేమిటి అని అడిగితే మాత్రం అన్నీ విచారణలోనే తేలుతాయని దబాయించాడు.





రథం తగలబడటంలో మతపరమైన కుట్ర దాగుందని ఆరోపించిన ఎంపి దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండానే అలాంటి ఆరోపణలు ఎలా చేస్తాడు ? హిదువుల విశ్వాసాలను దెబ్బతీయటం మంచిది కాదని హితవు కూడా చెప్పేశాడు. తాను చెప్పిన హితవు ఎవరిని ఉద్దేశించో ఎంపి స్పష్టం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని డిజిపితో మాట్లాడి నిందుతులెవరైనా, ఏ మతస్తులైనా సరే వాళ్ళపై యాక్షన్ తీసుకవాలంటూ ఎంపి చేసిన డిమాండ్ చేయటం వెనుకే అసలైన కుట్ర కోణం ఉందని వైసిపి వర్గాలు ఎదురుదాడి మొదలుపెట్టాయి. ఎంపి ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా తెలిసిపోతోంది. జగన్ క్రిస్తియన్ అని జనాలకు పదే పదే గుర్తు చేయటమే ఎంపి టార్గెట్ గా తెలిసిపోతోంది.





జగన్ క్రిస్తియన్ అయితే ఏమిటి ? ఈ విషయాన్ని ఎంపి కొత్తగా జనాలకు చెప్పేదేముంది ? వైఎస్ కుటుంబం గురించి అన్నీ తెలిసే కదా జనాలు మొన్నటి ఎన్నికల్లో వైసిపికి అఖండ మెజారిటిని కట్టబెట్టింది. ఎంపి ఎక్కడ ఏ విషయాన్ని మాట్లాడినా జగన్ను పదే పదే క్రిస్తియన్ అని చెప్పటంలో అర్ధంలేదు. ఇంతా చేసి రథం దహనం వెనుక తేనెపట్టును తీసుకోవాలన్న కొందరి అత్యుహమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. తేనెపట్టుకోసం కొందరు గుర్తు తెలీని వ్యక్తులు కాగడాలను వెలిగించటం వల్లే రథనాకి మంటలు అంటుకున్నాయని ప్రాధమికంగా తెలిసిందంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పిన విషయం గమనార్హం. వాస్తవాలు ఇలాగుండగా ఎంపి మాత్రం రథం తగలబడటం వెనుక మతం కోణం ఉందని చెప్పటమంటే జగన్ పై తనకున్న మంటను బయట పెట్టుకోవటమే అని పార్టీ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: