దొంగలు పడ్డ ఆర్నెల్లకి కుక్కలు మొరిగినట్లు - వామన్ ‌రావు దంపతుల హత్య తరవాత, చాలా కాలానికి ప్రభుత్వంలోని ఒక ప్రధాన హోదాలో ఉన్న మంత్రి కేటీఆర్ స్పందించారు.


గౌరవ మంత్రివర్యులైన కేటీఆర్ గారు! ఈ ఎడిటోరియల్ లో ప్రకటించిన విషయం పూర్తిగా ప్రజాభిప్రాయమే. మీ వైరి పక్షాల మాటలు కాదు! ప్రజల్లో అత్యధికుల అభిప్రాయమే. ఇందులో ఇసుమంత కూడా మీ విపక్షాల మాటలు కాదు. ప్రజలు మీ నుండి కోరేది సహకారంతో కూడిన పాలనే.  


"హంతకులు ఎవరైనా పట్టుకోవాలని ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు. కొందరు చేసే విమర్శలను న్యాయవాదులు పట్టించుకో వద్దన్నారు. బీజేపీ అభ్యర్థి ఉస్మానియా యూనివర్సిటీ కాంపస్ కు వెళ్లి అన్యాయంగా మాట్లాడారని చెప్పారు"


"మోదీ వచ్చాక న్యాయ వాదులకు చేసిన ఒక్క మంచి పని చెప్పండన్నారు. కేసీఆర్‌ను ప్రశ్నించే గొంతులన్నీ మోదీ దగ్గర పిల్లులేనని వ్యాఖ్యానించారు"

"కాంగ్రెస్‌కు చరిత్ర ఉంది కాని భవిష్యత్ లేదని తెలిపారు"

"మోదీ మనల్ని కాపీ కొట్టేలా కేసీఆర్ పథకాలు తెచ్చారని పేర్కొన్నారు. డబ్బా కొట్టుకునే గుజరాత్ ‌లో ఉచిత కరెంట్ లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ అధ్యక్ష పదవులు లేవని మంత్రి కేటీఆర్ విమర్శించారు"


పైన కెటిఆర్ ప్రేలినవన్నీ అసందర్భ ప్రలాపాలు. జనం కోరింది వదిలేసి ప్రతిపక్షాలను నిందించే కుతంత్రం పాలకులకు తగదు. దానికి వేరే వేదికను సిద్ధం చేసుకోవాలి. ఇదెంత వరకు సమంజసం. బాధ్యతాయుత పదవులు నిర్వహించేవారే, ఇలా ప్రవర్తించటం అన్యాయం.


సీఎం అంతటి వ్యక్తి, డిఫెక్టో  సీఎం, కేటీఆర్ ఆలోచన సరళిగాని, ప్రవర్తనగాని నాయకత్వానికి సరిపడవని తేలిపోయింది. న్యాయవాదులు పట్టించుకోవద్దంటే ఎలా? హంతకులను వారి నేపథ్యంలో ఉన్నవారిని - ఆరోపణలలో ఉన్నవారిని విచారించాలి కదా! న్యాయ విచారణ సమగ్రంగా జరిపిన తరవాత ఏమైనా మాట్లాడొచ్చు కానీ, "తొందర  పడి ముందే కూసిన కోయిల" అన్నట్లు ప్రవర్తించటం ధర్మమా! ఒక లాయర్ దంపతుల హత్య అందులోను ఒక మహిళా లాయర్ - అంత కిరాతక చర్యకు ప్రభుత్వం నుండి రావలసిన ప్రతిస్పందన లేకపోగా ప్రతిపక్షాలను నిందించటానికి ఇది సరైన వేదిక కూడా కాదు.


ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను మీరు నెరవేర్చలేదు అని నిలదీసిన దానికి - మీ సమాధానం మీరు పాలించే రాష్ట్రాల్లో గాని, కేంద్రంలో గాని మీరు నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నిస్తే అది సరైన సమాధానం కానీ, ప్రతిస్పందన కానీ కాదు. ప్రజలకు కావలసింది శాంతిభద్రలను పరి రక్షించే ప్రభుత్వం. అలాకాదని మీ మాటల్లో రుజువు చేసుకున్నారు. కక్షపూరిత వ్యాఖ్యలు, అలాంటి పాలన తెలంగాణ ప్రజలు కోరుకోలేదు.
ఈ హత్యలపై ప్రతిపక్ష ఆరోపణలను పట్టించుకోవద్దని న్యాయవాదులకు ఉద్భోద చేయటం న్యాయవాదులనే కాదు ఎన్నుకున్న ప్రజలను కూడా అవమానించినట్లే. ముందు విచారణ నేరగాళ్లనేకాదు, నేపధ్యలోని పెద్దలను బయటకు లాగి, అప్పుడు మీరు మాట్లాడండి అది సభ్యత.



తెలంగాణాలో అసభ్యకర బాషా ప్రయోగం మొదలెట్టింది కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అంటారు. బూతులు మొదలెట్టి ముఖ్యమంత్రిని అంత మాటంటారా? అంటే 'ఆకాశంలోకి స్ట్రయిట్ గా విసిరిన రాయి, తిరిగి అది  విసిరిన వాడి ముఖం మీదే పడటం ధర్మం" అదే జరుగుతుంది.
మంచిగా మాట్లాడటం చాల అవసరం. తెలంగాణ వచ్చి ఏడేళ్లయింది. ఇంకా ఉద్యమ కాలం బాష మాట్లాడటం సభ్యత అనిపించుకోదు.  



రాష్ట్ర పాలకులు బిజెపి గాని కాంగ్రెస్ గాని కాదు. వాళ్ళ మాటలను వదిలేసి హతులైన లాయర్ దంపతుల ఆత్మా శాంతికైనా - కేస్ విచారణ తూ...తూ.. మంత్రంగా కాకుండా నిజాయతీగా జరిపించి, నేరగాళ్లు మీ పక్షంలో ఉన్న వాళ్లపై చర్య తీసుకోండి. రానున్న ఎన్నికలు మియు నిజాయతీకి అగ్నిపరీక్షగా నిలుస్తాయన్నది మరవద్దు.



ఇక మీ పథకాలు మీరు చెప్పుకొనేంత కాపీ గొట్టే పథకాలు కాదు. మీరంతా "టాక్స్ పేయర్స్ మని" ని ఉంచితంగా పంచెస్తున్నారు. ఇదేమి మీరు సృష్టించిన సంపద కాదు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు లక్షల కోట్లతో అప్పుల కుప్పయింది. ఇప్పుడు మోడీ ప్రయివేటీకరణ ద్వారా దేశరుణాన్ని తీరుస్తున్నారు. మీరు అదేపని ముందు ముందు చేయక తప్పదు. కనీసం మోడీ ఉచితాలు సమర్ధించటం లేదు.



మాట్లాడితే గుజరాత్ అంటారు. అది వదిలేయాలి. మీరు మా తెలంగాణను పాలిస్తున్నారని గుర్తుంచుకోండి. "ఉచితం ఏదైనా అనర్ధదాయకం" ప్రజలను సోమరి పోతులను తయారు చేసే మీ విధానం దేశ ఆర్ధిక ఆరోగ్యాన్ని కాపాడదు.



మీ పాలనలో విద్యను చంపేశారు. ఆరోగ్యాన్ని అమ్మేసారు. కరోనా వేళ ప్రజలని పూర్తిగా విస్మరించారు. పరీక్షలను సరిగా నిర్వహించలేదు/లేరు. ఫలితాల వేళ మరి ఘోరం పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ లీలలు వర్ణించతరమా? మీ ధరణి ముడుచు కొని మూల కూర్చుంది. శాంతి భద్రతలు అటకెక్కాయి. ముఖ్యమంత్రి తన అధికార కార్యాలయానికి రారు. మీరు అతి తక్కువగా కనిపిస్తారు. ఎన్నికల ప్రచారంలో కనిపించటం అది పాలనకు కాదు.



ఇలా చేసిన మీరు - ఎదో రాష్ట్ర పాలన బాగాలేదనో? బాగుందనో చెబితే సరిపోదు. దయచేసి ఆ లాయర్ దంపతుల ఘోర హత్యపై న్యాయ విచారణ జరిపించమని - న్యాయాన్ని పరిరక్షించామని ఈ ఎడిటోరియల్ ద్వారా ప్రజలలో ప్రతిధ్వనించే ఘోషను మీ దృష్టికి తెచ్చాము. పాలకులు మారటం కంటే పాలన మారటం అవసరం. అది కాకపోతే - దుబ్బాక పరిణామం రాష్ట్రమంతా వ్యాపిస్తుంది. మీరు బిజెపి రామచంద్ర రావు కిచ్చిన సమాధానం న్యాయవాదులు గాని ప్రజలు గాని కోరలేదు.


ఇక్కడ కాంగ్రెస్ గాని, బిజెపి గాని చేసేదేమి లేదు. పాలనా మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అంటే కాదు ప్రజలు మిమ్మల్ని దుబ్బాకలో ప్రశ్నించారు ఇప్పటికే. హైదరాబాద్ లో ప్రశ్నించారు. ఇకనైనా సరైన పాలన అందించండి.







మరింత సమాచారం తెలుసుకోండి: