అభివృద్ధిలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఇప్పటికే నికర ఆదాయంతో నిలకడగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి దళిత బంధు పథకం గుదిబండగా మారనుంది. అటు సంక్షేమ పథకాల అమలుకు ఇప్పటికే అన్ని నిధులు ఖర్చు చేస్తున్న టీ సర్కార్... కొత్తగా ప్రకటించిన దళిత బంధు పథకం కోసం అప్పుల వేటలో పడింది. దళిత బంధు పథకం ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక శాఖపై ఆర్థిక భారాన్ని పెంచింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఏకంగా 30 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఏపీతో పోలిస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ... ఇప్పుడు అదే ఏపీతో అప్పుల్లో పోటీ పడుతోంది.

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ సర్కార్ అమలు చేస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుక ఇబ్బడిముబ్బడిగా పథకాలను ప్రకటించారు సీఎం కేసీఆర్. షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, రుణ మాఫీలు, రైతు బంధు... ఇప్పుడు దళిత బంధు... ఇలా ఎన్నో పథకాలను టీ సర్కార్ అమలు చేస్తోంది. వీటితో పాటు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది కూడా.

అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు భారీగానే నిధులు ఖర్చు చేసింది ఆర్థిక శాఖ. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. రాష్ట్ర స్థూల ఆదాయంలో 3.5 శాతం అప్పులు చేసేందుకు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం గతంలో అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఎఫ్‌ఆర్‌ఎంబీ చట్టం కూడా తీసుకువచ్చింది కేంద్రం. దీని ప్రకారం నికర ఆదాయానికి మించి అప్పులు చేయకుండా రాష్ట్రాలకు పరిమితి విధించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం మరింత పెరిగింది. దీంతో అప్పు తప్పని పరిస్థితిగా మారింది తెలంగాణ ఆర్థిక శాఖకు. అందుకోసమే రుణాల సేకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేసింది టీ సర్కార్. ఇలా సేకరించిన రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉండనుంది.


ప్రస్తుతం వడ్డీల కిందే ప్రతి నెలా ఏకంగా 2 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తోంది టీ సర్కార్. ఈ పరిస్థితుల్లో కొత్తగా అప్పులు తీసుకోవడం మరింత కష్టం కానుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ఆదాయం పెంచు కోవడం కోసం భూముల విలువ పెంచడం, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం వంటి చర్యలు చేపట్టింది కేసీఆర్ సర్కార్. అలాగే ప్రభుత్వ భూములను కూడా అమ్మకానికి పెట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: